ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ ఉద్దేశంలో నోట్ల రద్దు చేశారో స్పష్టంగా చెప్పలేదు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటిస్తున్నప్పుడు.. బ్లాక్‌మనీని అరికట్టడానికని.. ఉగ్రవాదుల చేతుల్లో ఉన్న సొమ్మంతా.. పనికి రాకుండా చేయడానికేనని ఉదరగొట్టారు. అప్పటికే కొన్ని లక్షల కోట్ల నల్లధనం ఉందని.. అదంతా ఇప్పుడు బయటకు వస్తుందన్నట్లు చెప్పుకొచ్చారు. అలా బయటకు వచ్చే సొమ్ము పేదలకు ఇస్తారని.. చాలా మంది పేద, మధ్య తరగతి వర్గాలు…నోట్ల రద్దు కష్టాలను భరించాయి. పెద్ద నోట్లను రద్దు చేసిన వారం తర్వాత.. బ్యాంకులకు పోటెత్తుతున్న నగదును చూసి.. ప్రధానమంమత్రి నరేంద్రమోదీ.. బ్లాక్‌మనీ ప్రస్తావన తీసుకురాలేదు. నగదు రహిత లావాదేవీల కోసమే నోట్ల రద్దు అన్నట్లు ప్రచారం చేశారు. నగదురహిత లావాదేవీల ప్రొత్సాహానికి ఏం చేయాలో..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఓ కమిటీ కూడా నియమించారు. డిజిటల్ లావాదేవీల కోసం యాప్‌లు ఆవిష్కరించారు.
ప్రైజులు ప్రకటించారు. ఏటీఎం, బ్యాంకుల్లో నగదు దొరకకపోతూండటంతో… ప్రజలు తప్పనిసరిగా.. డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గారు. కానీ అక్కడ ఫీజుల బాదుడు చాలా ఎక్కువగా ఉండటంతో.. మెల్లగా మళ్లీ నగదు లావాదేవీలకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో బ్యాంకుల్లో వరుస స్కాములు బయటపడటం.. వేల కోట్లు అప్పులు తీసుకున్న పారిశ్రామికవేత్తలు పరారవడంతో కలకలం రేగింది. అదే సమయంలో కేంద్రం ఎఫ్ఆర్డీఏ బిల్లును ప్రతిపాదన తెచ్చింది. ఈ బిల్లు అంటూ పాస్ అయితే.. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుకు కూడా గ్యారంటీ లేదని… ప్రచారం జరిగింది. దాంతో.. ప్రజలు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా విత్ డ్రా చేసుకోవడం ప్రారంభించారు. అంటే.. బ్యాంకులపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. ఈ ప్రభావం ఎంత తీవ్రంగా ఉందంటే… నోట్ల రద్దుకు ముందు ప్రజల వద్ద రూ. 7.8లక్షల కోట్ల కరెన్సీ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ప్రజల చేతుల్లో రూ. 18.5లక్షల కోట్ల లిక్విడ్ క్యాష్ ఉంది. అంటే… దాదాపుగా బ్యాంకుల్లో ఉండాల్సిన పది లక్షల కోట్ల రూపాయలను ప్రజలు విత్ డ్రా చేసేసుకున్నారు. ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో.. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నోట్లను విడుదల చేయక తప్పలేదు.
సాధారణంగా మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీ నుంచి బ్యాంకుల వద్ద ఉన్న నగదును తీసేసి.. ప్రజల వద్ద ఉన్న కరెన్సీని లెక్కిస్తారు. ఆర్బీఐ చలామణిలోకి తీసుకొచ్చిన కరెన్సీ విలువ కూడా పెరిగింది. నోట్ల రద్దు తర్వాత రూ. 8.9లక్షల కోట్ల విలువైన కరెన్సీ చలామణిలో ఉండగా.. ప్రస్తుతం అది రూ. 19.3లక్షల కోట్లకు పెరిగింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు తిరిగొచ్చిన సొమ్ము 98.96శాతం. అంటే దాదాపుగా మొత్తం తిరిగొచ్చేశాయన్నమాటే. ఇక నల్లధనం ప్రశ్నే లేదు. ఉన్న వాళ్లు వైట్ చేసేసుకున్నారు.