ఇప్పుడు ఇల్లు కొనే ప్రతి ఒక్కరికి ఈఎంఐ అనేది జీవితకాల బాకీ. ఈఎంఐలకు తగ్గట్లుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటారు. అయితే బ్యాంకులు ఒక్కో సారి ఈఎంఐ టెన్యూర్ పెంచడం లేదా.. ఈఎంఐ మొత్తాన్ని పెంచడం హఠాత్తుగా చేస్తూంటాయి. దీంతో లోన్ తీసుకున్న వారికి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఇలాంటి ఫిర్యాదులు పెద్ద ఎత్తున ఆర్బీఐకి చేరడంతో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి ముందస్తు సమాచారం లేకుండా ఆటోమేటిక్ గా లోన్ కాలపరిమితి పెంచడం, వడ్డీ రేట్లు పెంచడం వంటివి చేయకూడదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. రుణాల కాలపరిమితిని పెంచే ముందు రుణదాతలు లోన్ పేయర్స్ సమ్మతిని తప్పనిసరిగా పొందాలి. వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్‌లో ఏదైనా మార్పులుంటే ముందే వాటి గురించి స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. రుణ గ్రహీత ఆమోదం లేకుండా ఆటోమేటిగ్గా ఈఎంఐ పెరుగుదల లేదా కాలపరిమితి పొడగింపులు ఇక ఉండవు.
కొత్త మార్పులు రుణగ్రహీతలకు ఆర్థికంగా మేలు చేయకపోవచ్చు కానీ.. సమాచారం అయితే లభిస్తుంది. బ్యాంక్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు రుణ గ్రహీతలకు తెలియకుండా.. అలాగే వారి సమ్మతి పొందకుండా ఈఎంఐ లేదా లోన్ టెన్యూర్ని మార్చలేవు. గతంలో బ్యాంక్‌లు అప్పు తీసుకొన్న వారిని సంప్రదించకుండానే ఈఎంఐ లేదా రుణ కాలపరిమితిని పొడిగించేవి. ఈఎంఐ లేదా కాల పరిమితిని తగ్గించడానికి ముందస్తు చెల్లింపులు చేయడం లాంటి విషయాలపై లోన్ పేయర్స్‌కే పూర్తి నియంత్రణ ఉంటుంది.