సర్కారోడు, సీఈవో, సిటిజన్. విశ్వంభర….
ఇలా… రామ్ చరణ్ – శంకర్ సినిమాకి అనుకొన్న టైటిళ్లు చాలా ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి సెట్ చేస్తారని ఫ్యాన్స్ భావించారు. కానీ సడన్‌గా… శంకర్ కొత్త టైటిల్ ని బయటకు తీసుకొచ్చాడు. `గేమ్ ఛేంజర్` అనే పేరు చరణ్ సినిమాకి ఫిక్స్ చేశాడు. నిజానికి ఈ టైటిల్ గురించి బయటకు ఎలాంటి లీకూ రాలేదు. చిత్ర బృందంలో కూడా చాలామందికి ఈ పేరు పెడతారన్న ఐడియా కూడా లేదట. తన మనసులో అనుకొన్న పేరు.. ప్రకటించి సడన్‌గా అందరినీ సర్ప్రైజ్ చేశాడు శంకర్.
నిజానికి ఇదో పొలిటికల్ థ్రిల్లర్. అందుకే టైటిల్ కూడా దాన్ని ధ్వనించేలా ఉంటుందని భావించారంతా. `గేమ్ ఛేంజర్` మాత్రం ఎవరికీ ఊహకూ రాని టైటిల్. పొలిటికల్ గేమ్ లో… కింగ్‌లూ, కింగ్ మేకర్లూ ఉంటారు. గేమ్ ఛేంజర్.. అనే పదం పాలిటిక్స్‌కి లింక్ చేయడం శంకర్ తెలివి తేటలకు, ఆలోచనా విధానానికీ నిదర్శనం. టైటిల్ పాన్ ఇండియా స్థాయిలో మోత మోగాలంటే.. అందరికీ తెలిసే పదమై ఉండాలి. గేమ్ ఛేంజర్ అంటే తెలియనివాళ్లు లేరు. కాబట్టి.. శంకర్ ఈ టైటిల్ వైపు మొగ్గు చూపించాడు. అయితే.. ఈ టైటిల్ మాస్‌కి ఎంత ఎక్కుతుందన్నది ప్రశ్నార్థకమే. చరణ్ అభిమానుల్లో మాస్ శాతం చాలా ఎక్కువ. ఎందుకంటే.. వాళ్లంతా చిరంజీవిని బేస్ చేసుకొని అయిన ఫ్యాన్స్. వాళ్లకు టైటిల్ కాస్త కొరుకుడు పడని వ్యవహారమే. కాకపోతే.. ఈ సినిమా విడుదలకు ఇంకా సమయం ఉంది. ఈలోపుగా.. టైటిల్ ని మెల్లమెల్లగా జనంలోకి తీసుకెళ్లొచ్చు. అందుకే… శంకర్ ఈ టైటిల్ ని ధైర్యంగా ప్రకటించేశాడు.