‘ఈసారి కప్పు మనదే’ అని టోర్నీకి ముందు ఊదరగొట్టడం, ఆ తరవాత రిక్త హస్తాలతో ఇంటికి వెళ్లడం… ఐపీఎల్ లో ఆర్సీబీకి అలవాటే. కోహ్లీ, డూప్లెసిస్, మాక్స్వెల్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నా, బెంగళూరుకు ఐపీఎల్ లో చెత్త రికార్డే. కోహ్లీ కెప్టెన్సీ వదిలి, ఆ పగ్గాల్ని డూప్లెసిస్కి అప్పగించినా… జాతకం మారలేదు. ఈ ఐపీఎల్ లోనూ బెంగళూరు అత్యంత దయనీయ ఆటతీరు ప్రదర్శిస్తోంది. 8 మ్యాచ్‌లు ఆడి, కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. కొలకొత్తాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గెలిచే మ్యాచ్‌ని చేచేతులా జారవిడచుకొంది. కష్టసాధ్యమైన (223) లక్ష్యాన్ని చేధించడానికి బరిలో దిగి, కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ గెలిస్తే బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగటా ఉండేవి. కానీ.. అనూహ్యంగా ఓటమి పాలై, అభిమానులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఇకపై బెంగళూరు ఏం చేసినా ప్లే ఆఫ్‌కి చేరదు. ఈ సీజన్లో ప్లే ఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ఆర్సీబీ అవతరించినట్టే. ప్రస్తుతానికైతే కొలకొత్తా, హైదరాబాద్, రాజస్థాన్, చెన్నై తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. లక్నో, కొలకొత్తాకు కూడా ప్లే ఆఫ్ ఛాన్సుంది. పంజాబ్, ఢిల్లీ అద్భుతాలు చేస్తే తప్ప… ప్లే ఆఫ్‌కి చేరడం కష్టం.