సదావర్తి సత్రవ భూములపై చెలరేగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాల రావు స్పందించారు. ఆ భూములకి మళ్ళీ వేలంపాట నిర్వహిస్తామని చెప్పారు. దానిపై కొన్ని రోజుల క్రితం హైకోర్టులో విచారణ జరిగినప్పుడు, ఆ భూముల వేలంలో ఎటువంటి అవినీతి జరుగలేదని, ఒకవేళ ఎవరైనా అంతకంటే ఎక్కువ చెల్లించడానికి ముందుకు వస్తే వారికే ఆ భూములు అప్పగిస్తామని తెలిపారు. దానిపై స్పందించిన రెండు, మూడు ప్రైవేట్ సంస్థలు ఆ భూములకి రూ.5 కోట్లు అదనంగా అంటే రూ.27 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ వారి ప్రతిపాదనలని ప్రభుత్వం తిరస్కరించి, మళ్ళీ భూములు వేలం వేయడానికే సిద్దపడినట్లు తెలుస్తోంది. వేలంలో వాటిని దక్కించుకొన్నవారే ఆ భూములలో ఆక్రమణలు తొలగించుకోవాలని, దాని కోసం వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించదని, అవసరమైతే తమిళనాడు ప్రభుత్వ సహకారం తీసుకోవాలని ఆ సంస్థలకి సూచించినట్లు తెలుస్తోంది.
ఆ భూములని మళ్ళీ వేలం వేస్తామని మంత్రి మాణిక్యాలరావు ప్రకటించారు కనుక ఈ షరతులు కూడా నిజమేనని భావించవలసి ఉంటుంది. అటువంటి షరతులతో భూములు కొనదలిస్తే, తమిళనాడులో అధికార పార్టీకి చెందిన రాజకీయ నేతలు తప్ప మరెవరూ కొనలేరు. అయినా వేలంలో అందరి కంటే ఎక్కువగా పాడి డబ్బు చెల్లించి భూమిని కొనుకొంటున్నవారికి ఆ భూములలో ఎటువంటి ఆక్రమణలు లేకుండా చేసి ఆ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించవలసిన బాధ్యత డబ్బు తీసుకొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే అవుతుంది తప్ప తమిళనాడు ప్రభుత్వానిది కాదు కదా! ఇటువంటి షరతులు పెట్టడం నిజమైతే, వేలంపాటలో ఎవరూ పాల్గొనకుండా నిరుత్సాహపరిచేందుకేనని అనుమానించవలసి వస్తుంది. ఏమైనప్పటికీ సదావర్తి భూములని మళ్ళీ వేలం వేస్తామని చెప్పడం ద్వారా దానిలో చాలా అవినీతి జరిగిందని వైకాపా చేసిన ఆరోపణలని దృవీకరించినట్లయింది. చట్టప్రకారం, పూర్తి పారదర్శకంగా వేలం నిర్వహించి ఉంటే ఈ పరిస్థితి, ఇటువంటి ఆరోపణలు ఎదుర్కోవలసిన అవసరం వచ్చేది కాదు కదా?