గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలో మజ్లిస్ గూండాలో ఎన్నికల రోజున ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారో అందరూ గమనించారు. అయితే ఒక్క డివిజన్లో మాత్రం 5వ తేదీన రీపోలింగ్ నిర్వహించడానికి ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇది కేవలం నామ్కేవాస్తే తూతూ మంత్రం రీపోలింగ్ మాత్రమే అని.. ఇన్ని అరాచకాలు బహిరంగంగా జరిగిన నేపథ్యంలో ఎన్నికల సంఘం అసలేమీ చేయకపోతే విమర్శలు తప్పవు అనే భయంతోనే నిర్వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
నిజానికి మజ్లిస్ ప్రాబల్యం ఉన్న పాతబస్తీలోని పలు డివిజన్లలో వారు యథేచ్ఛగా బెదిరింపులకు, రిగ్గింగ్‌కు దాష్టీకాలకు పాల్పడినట్లుగా వార్తలు వచ్చాయి. ఎన్నికల వేళ తమ సామ్రాజ్యం గా పాతబస్తీని భావించే మజ్లిస్ ఇష్టారాజ్యంగా చెలరేగిపోయినట్లు అందరూ చూశారు. ఇలా తమకు ఆస్కారం ఉన్న ప్రతిచోటా మజ్లిస్ చెలరేగి రిగ్గింగ్ చేసుకున్నది అనేది అందరూ గమనించిన సంగతే.
అయితే కేవలం ఒక్క 54వ డివిజన్లో మాత్రం రీపోలింగ్‌కు ఆదేశించారు. ఒక్కడివిజన్లో రీపోలింగ్ జరిగితే ఏమవుతుంది? ఒక్కడివిజన్లో ఫలితం మారితే మాత్రం ఏమవుతుంది. ఇదంతా కేవలం తాము కళ్లు మూసుకుని కూర్చున్నాం అనే అపకీర్తి రాకుండా మొక్కుబడిగా ఎన్నికల సంఘం చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి.