ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మీద గడచిన కొద్దిరోజులుగా ఘాటైన విమర్శలు చేస్తూ వస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఇవాళ్ల భారత్ బచావో నిరసన కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. దీన్లో సోనియా, రాహుల్ గాంధీతోపాటు ముఖ్యనేతలు పాల్గొని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలన మీద విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… రామ్ లీల మైదాన్‌లో చేపట్టిన నిరసన కార్యక్రమానికి తెలంగాణ నుంచి నాలుగు వేలమంది కార్యకర్తలూ నాయకులు వచ్చారన్నారు. దేశంలో అన్ని వ్యవస్థల్నీ ప్రధాని మోడీ నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఆర్థిక మాంద్యం వల్ల దేశం తిరోగమనంలోకి వెళ్తోందన్నారు. గడచిన డెబ్బయ్యేళ్లలో దేశ ఆర్థిక పరిస్థితి ఇంతగా ఎప్పుడూ క్షీణించలేదన్నారు. నోట్ల రద్దు నిర్ణయం పూర్తిగా విఫలమైందనీ, జీఎస్టీ వికటించిందన్నారు. ప్రపంచంలో ఎక్కడో ఏదో జరిగితే మాత్రం మన ప్రధాని వెంటనే స్పందిచేస్తుంటారనీ, ఇక్కడి పరిస్థితులు ఆయనకి పట్టవన్నారు. ఆయనకి విదేశీ పర్యటనల మీదున్న వ్యామోహం దేశ ప్రజల మీద లేదన్నారు.
రాష్ట్ర సమస్యల్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్దామని పార్లమెంటు సభ్యులుగా తాము ప్రయత్నించామనీ, అపాయింట్మెంట్ కోరితే పీఎంవో తమని పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెత్తందారీ పోకడలతోనే దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నడుతుపుతున్నారన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా రేవంత్ వదల్లేదు! ఆరేళ్ల కేసీఆర్ పాలన అధ్వాన్నంగా తయారైందన్నారు. అరవయ్యేళ్లపాటు పోరాటాలు చేసి, ఎంతోమంది ప్రాణాలను పణం పెట్టి తెచ్చుకున్న తెలంగాణ రాచరికపు పోకడులున్న వ్యక్తి చేతిలో బంధీ అయిందన్నారు. కేసీఆర్ దోపిడీ ఆపేస్తే రాష్ట్ర ధనవంతంగా ఉంటుందన్నారు. నాలుగు కోట్ల మంది దివాలా తీసేస్తే, కేసీఆర్ కుటుంబంలో నలుగురు మాత్రమే శ్రీమంతులయ్యారన్నారు.
మోడీ పాలనపై విమర్శించేందుకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఈ సభ పెట్టుకున్నా, ఈ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద విమర్శలు చేసేందుకు రేవంత్ ప్రాధాన్యత ఇచ్చారు. అంతేకాదు, రామ్ లీల మైదాన్ లో తమ నాయకులు ఇచ్చిన సందేశంతో రాష్ట్రంలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. అంటే, ఢిల్లీ నుంచి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ పై తన పోరాటం మొదలౌతుందని రేవంత్ చెబుతున్నారు. ఈ మధ్యనే సొంత ఆఫీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్వరలో పోరాటమంటూ తన కార్యాచరణను ప్రకటించేసుకున్నారు. మరి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను లీడ్ చేయమంటూ రేవంత్ కి హైకమాండ్ నుంచి ఏవైనా సంకేతాలు అందాయేమో మరి!