ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు స్కీంపై అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఈ హామీని ఎప్పటి నుంచి అమలు చేయనున్నారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ స్కీమ్ అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందని అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం.
కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలు ద్వారా ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందో అధికారులు వివరాలు సేకరిస్తున్నారని అంటున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులో నిత్యం ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు అనే దానిపై నివేదికను సిద్దం చేశారని అయితే, ఫ్రీ బస్సు పథకం అమలు చేస్తే బస్సులో రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు కావాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అటు.. ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు చేస్తే తెలంగాణలో లాగా అటో డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది.
దీంతో అలాంటి చిక్కులు తలెత్తకుండా ఉండేలా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై అధికారులు ఈ పథకం అమలుపై ఓ నివేదిక రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే, రాష్ట్రమంతటా ఈ ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేయాలా..? లేదంటే పరిమితులు విధించాలా..? అనే అంశంపై చంద్రబాబు సారధ్యంలోని మంత్రిమండలి భేటీ తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.