ఏదైనా ఓ ప్రాంతానికి కంపెనీలు వస్తేనో, రింగు రోడ్లు మంజూరు అయితేనో భూమి రేట్లు పెరుగుతాయి. ఓ వ్యక్తి ఎం.ఎల్.ఏ గా అడుగు పెడితే రియల్ బూమ్ రావడం పిఠాపురం విషయంలోనే సాధ్యమైంది. అవును.. ఇది అక్షరాలా నిజం.
పవన్ కల్యాణ్ ఏ ముహూర్తాన పిఠాపురం ఎం.ఎల్.ఏ గా ఎన్నికయ్యాడో అప్పటి నుంచీ అక్కడ భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. పవన్ తమ నియోజక వర్గానికి ఏదో సాధిస్తాడని తెలుసు. ఆరు నూరైనా, నూరు ఆరైనా తన నియోజక వర్గాన్ని అభివృద్ది చేస్తాడని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. పిఠాపురాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజక వర్గంగా తయారు చేస్తానని పవన్ ఇది వరకే మాట ఇచ్చాడు. ఆయన అన్నాడంటే చేసి తీరతాడంతే. పిఠాపురాన్ని అభివృద్ది చేయడానికి పవన్ కంటూ సొంత ప్రణాళికలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి కంపెనీలు తీసుకురావడంలోనో, నిధులు మంజూరు చేయించడంలోనో పవన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా పవన్ పిఠాపురంలో ఇల్లు కట్టుకొంటున్నాడు. అందుకోసం అనువైన స్థలం వెదుకుతున్నాడు. పవన్ ఉంటే, ఆ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ వస్తుంది. ఇందులో అనుమానం లేదు. అందుకే పిఠాపురంలో రియల్ బూమ్ ప్రారంభమైంది. ఇదివరకెప్పుడూ లేనంత ధర.. ఇప్పుడు పిఠాపురం భూములకు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు. కాకినాడలో కూడా లేనంత రియల్ బూమ్ పిఠాపురంలో ఉందని, ఇది పెరిగేదే కానీ, తగ్గేది కాదని, పిఠాపురం ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ”ఇది వరకు ఇంట్లో కూతురు ఉంటే, తనకు పెళ్లి చేయాలనుకొంటే ఒక ఎకరం పొలం అమ్మాలనుకొనేవాళ్లం. ఇప్పుడు అర ఎకరం అమ్మితే చాలు. ఆ స్థాయిలో రేట్లు పెరుగుతున్నాయి. కొందామన్నా పిఠాపురంలో అమ్మేవాళ్లు కనిపించడం లేదు. ఇక్కడి రియల్ బూమ్ కి ఇది నిదర్శనం” అని స్థానికులు గర్వంగా చెబుతున్నారు. అదీ పవన్ కల్యాణ్ అంటే!!