వైఎస్ వివేకా హత్య కేసులో కడప పోలీసులు విచారణ ప్రారంభించారు. కానీ సాంకేతికంగా అది వివేకా హత్య కేసు కాదు. వివేకా పీఏ కృష్ణారెడ్డి పెట్టిన తప్పుడు కేసుపై విచారణ. సీబీఐ అధికారులు బెదిరిస్తున్నారని గతంలో వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డితో తప్పుడు కేసులు పెట్టించారు. ఇప్పుడు ఆకేసులపై కోర్టు మరింత లోతుగా విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో విచారణ ప్రారంభించారు. వైఎస్ జగన్ బంధువులు.. ముఖ్యంగా అవినాష్ రెడ్డి బంధువులకు నోటీసులు జారీ చేశారు.
ఇటీవల కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి వాంగ్మూలం నమోదు చేశారు. ఆయన ఏం చెప్పారో బయటకు తెలియలేదు కానీ పోలీసులు మాత్రం చాలా మంది తాజాగా నోటీసులు జారీ చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా గత ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత ఘోరం అంటే సీబీఐ అధికారులపైనే దాడులు చేయడం.. వారిపైనే ప్రైవేటు కేసులు పెట్టించడం. ఆ కారణంగా ఎంతో కాలం విచారణ ఆగిపోయింది.
ఇప్పుడు అందులో ఉన్న కుట్ర కోణాలన్నీ వెలుగులోకి వస్తాయి. నిజానికి వివేకా హత్య కేసులో అసలు విచారణను సీబీఐ ఆపేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మేరకు విచారణ చేసింది. ఇంకా పెంచాలన్న అభ్యర్థనపై నిర్ణయం తీసుకోలేదు. ఈ కారణంగా అటు విచారణ.. ఇటు కోర్టుల్లో ట్రయల్ జరగడం లేదు. ఈ లోపు నిందితులు అందరూ బెయిల్ పై బయటకు వచ్చారు. అవినాష్ రెడ్డి తండ్రి చాలా జైల్లో ఉన్నారు కానీ అవినాష్ రెడ్డి మాత్రం ఇలా అరెస్టు అయి అలా జైలుకు వెళ్లకుండానే బయటకు వచ్చేశారు. అంతా పేపర్ల మీద జరిగిపోయింది. ఇప్పుడు సిబిఐ అధికారిపై పెట్టిన దొంగ కేసుల్లో విచారణతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చే చాన్స్ కనిపిస్తోంది. ఈ వివరాలు తర్వాత అసలు హత్య కేసు విచారణలోనూ కీలకంగా మారనున్నాయి.