వివేకా కేసులో ఖచ్చితమైన సమాచారం ఇస్తే రూ. ఐదు లక్షల బహుమతి ఇస్తాం అని ప్రకటించిన సీబీఐ.. తాము పట్టుదలతో చేసిన విచారణలో తేల్చిన విషయాలతోనే కేసును ముగించి రూ. ఐదు లక్షలు మిగుల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన కీలక వ్యక్తి అని మరొకర్ని అరెస్ట్ చేసి.. సునీల్ యాదవ్‌తో కలిసి వారు ఎలా చంపారో ఓ కథను మీడియాకు కూడా లీక్ చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు ఉమాశంకర్ రెడ్డి అనే మరో నిందితుడ్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే సునీల్ కుమార్ యాదవ్‌ను తొలి నిందితునిగా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఉమాశంకర్ రెడ్డి అరెస్టుతో ఇద్దర్ని నిందితులుగా తేల్చినట్లయింది. ఉమాశంకర్ రెడ్డి సింహాద్రిపురం మండలం కుంచేకుల గ్రామంలో నివహిస్తూ ఉంటారు. వివేకా పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డి సోదరుడే ఉమా శంకర్‌రెడ్డి. సునీల్ యాదవ్‌తో స్నేహంగా ఉంటారని భావిస్తున్నారు. ఉమాశంకర్ రెడ్డిని చాలా రోజులుగా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించాయని అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఇప్పటికి ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ముగ్గురు వాంగ్మూలాలు నమోదు చేశారు. వాచ్మెన్ రంగయ్య, మాజీ డ్రైవర్ దస్తగిరిలతో పాటు కృష్ణమాచారి వాంగ్మూలాలు కూడా నమోదు చేయించారు. కృష్ణమాచారి ఆయుధాలు అమ్మిన వ్యక్తిగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో వైఎస్ కుటుంబసభ్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. వైఎస్ జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మూడు రోజుల కిందట సీబీఐ ఎదుట హాజరయ్యారు. అయితే ఈ కేసులో అసలు నిందితులంటూ బయట జరుగుతున్న ప్రచారానికి మూడు నెలల పాటు శోధన చేసి సీబీఐ చెబుతున్న వివరాలకు హస్తిమశకాంతరం ఉంది. అందుకే ప్రజలు కూజా “ఔనా ” అని సీబీఐ మొహం మీదే ఆశ్చర్యపడిపోయే పరిస్థితి వచ్చింది.