ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన ఇద్దరు నేతలకు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని బాగాతెలుసు. ఈ వాస్తవాన్ని ఒకాయన పూర్తిగా జీర్ణించుకుని ప్రత్యామ్నాయ మర్గాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపించడానికి కంకణబద్ధులైతే, మరొకాయన స్వీయ రాజకీయలబ్దికోసం జగన్నాటకం ఆడుతున్నారు. వీరిద్దరిలో ఒకరు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడైతే, మరొకరు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే అంతా సంతోషిస్తారు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవు. కాకపోతే, ప్రస్తుతమున్న వ్యవస్థలో ఇది సాధ్యంకాదన్న సంకేతాలు కేంద్రం నుంచి బలంగా కనిపిస్తున్నాయి. బిహార్ విషయం తీసుకుందాం. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాలాకాలం నుంచి చేస్తున్న ప్రత్యేక హోదా డిమాండ్ కు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గండికొట్టారు. అసాధ్యమైనవాటి విషయంలో కలలుకనడం మానుకోవాలని హితవు పలికారు. 14వ ఆర్థికసంఘం అమలుచేస్తున్న కొత్త ఫార్ములా దరిమలా, ప్రత్యేక హోదా అని పట్టుకువ్రేలాడటం హేతుబద్దం కాదన్నది ఆయన వాదన. కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నువనరుల భాగస్వామ్యం ఉండాలన్నదే కొత్త ఆర్థిక సూత్రం. ప్రస్తుతమున్న వ్యవస్థలో ప్రత్యేక హోదా శకం ముగిసినట్లేనన్నది అరుణ్ జైట్లీ కచ్చితాభిప్రాయం.
ప్యాకేజీలే శరణ్యం
రాష్ట్రాల అభివృద్ధికి ప్రస్తుతమున్న ఏకైక మార్గం కేంద్రం నుంచి ఆర్థిక ప్యాకేజీలను రాబట్టడమే. అంతకు మించి ఆశించేది ఏమీలేదు. ప్రధానమంత్రి మోదీ బీహార్ కు ఆమధ్య లక్షా25వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఈ పద్దతిలోనే అవసరమైన రాష్ట్రాల్లో అభివృద్ధి సాధించాలన్నది కేంద్రం యోచన. ఈ దిశగానే ఆర్థికపరమైన కసరత్తు జరిగిపోతున్నది.
రాష్ట్ర అభివృద్ధికి నిధులు సమకూర్చే మార్గం ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ వెనకబడుపోతుందన్న సత్యం ఇప్పుడు అందరికీ అవగతమైంది. బిహార్ విషయంలో జాతీయ అభివృద్ధి మండలి ఇప్పటికే ప్రత్యేక హోదా డిమాండ్ ను నిర్ద్వందంగా తిరస్కరించింది. బిహార్, లేదా ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు ప్రత్యేక హోదా కల్పిస్తే, ఇదే మార్గంలో మరికొన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సివస్తుంది. ఈ సందర్భంగా అసలు, ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు గతంలో ఇచ్చారో వాటి వెనుక ఉన్న కారణాలేమిటో తెలుసుకుందాం.
ప్రత్యేక హోదా ఇవ్వాలంటే…
1. కొండప్రాంతలైఉండీ, భౌగోళిక కారణాలరీత్యా, ప్రజలకు నిత్యావసర సేవలను అందించడం చాలా కష్టంగా ఉండాలి.
2. ప్రత్యేక హోదా కల్పించే ప్రాంతానికి (రాష్ట్రానికి) అంతర్జాతీయ సరిహద్దులుండాలి.
3. ఆ ప్రాంతంవారి సామాజిక, ఆర్థికాభివృద్ధికి చెందిన పారామితులు విభిన్నంగా ఉండాలి.
4. అభివృద్ధికి సంబంధించిన ప్రాధమిక సౌకర్యాల రూపకల్పనలో భౌగోళికమైన అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతుండాలి.
13వ ఆర్థిక సంఘం ఒక సర్వేలో తేల్చి చెప్పిన విషయాలివి. ఒక్క బిహార్ కే కాదు, మరే రాష్ట్రం స్పెషల్ స్టేటస్ డిమాండ్ తో ముందుకువచ్చే ముందు ఈ సూత్రాల పరిధిలో ఉందోలేదో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. కేంద్రం చాలా స్పష్టంగా తేల్చిచెప్పిన విషయం ఇది. ప్రస్తుతం ప్రత్యేక హోదాని ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ-కాశ్మీర్, ఉత్తరాఖండ్ అనుభవిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి చాలా ఆలస్యంగా మొదలైంది. అందుకే వీటికి కేంద్రం 90శాతం గ్రాంట్ ప్రకటిస్తోంది. ఉత్తరాఖండ్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలో పైన పేర్కొన్నసూత్రాలనే పరిగణలోకి తీసుకున్నారు. ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చే సమయంలో మరో రెండు కొత్త రాష్ట్రాలు- జార్ఖండ్, చత్తీస్ గడ్ కూడా హోదా కోసం డిమాండ్ చేశాయి. అయితే, వాటికి తగు అర్హతలు లేవని త్రోసిపుచ్చి ఉత్తరాఖండ్ కు ఇవ్వడం జరిగిందని ప్లానింగ్ కమిషన్ ప్రధాన సలహాదారు ప్రణబ్ సేన్ చెప్పడాన్ని ఇక్కడ మనం గుర్తుచేసుకోవాలి.
ప్రత్యేక హోదాని 1969లో అప్పటి ఐదవ ఆర్థిక సంఘం సూచనల మేరకు ముందస్తుగా మూడురాష్ట్రాలకు అందించారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలు (అరుణాచల్ ప్రదేశ్, అసోం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కం, త్రిపుర, ఉత్తరాఖండ్) ఈహోదాను అనుభవిస్తున్నాయి.
హోదావల్ల కలిగే ప్రయోజనాలు
ప్రత్యేక హోదా ఇస్తే చాలా ప్రయోజనాలు ఉండే మాట నిజం. జగన్మోహన్ రెడ్డి అంటున్నది కూడా ఇదే. ప్రత్యేక హోదా ఇస్తే చంద్రబాబుకూడా సంతోషిస్తారు. ఎందుకంటే, ఈ తరహా హోదా వస్తే, రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం ఆర్థిక ప్రోత్సాహాలు ఇస్తుంది. ప్రత్యేక హోదా క్రింద కేంద్ర ఆర్థిక సాయం 90శాతంగా ఉంటుంది. అదే మిగతా రాష్ట్రాలకు ఇది కేవలం 30శాతం మాత్రమే. పరిశ్రమలు ఎక్కువగా వస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అంతేకాకుండా విద్య, ఆరోగ్యం, వసతి వంటి ప్రాధమిక సౌకర్యాల ఏర్పాట్లలో కేంద్రం ఇతోధికంగా సాయంచేస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే మరో పక్క జగన్ ఉద్యోగ వర్గాలను, యువతను రెచ్చగొడుతున్నారు.
మోదీ వ్యూహం
రాష్ట్రవిభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి సహేతుకమైన అభ్యంతరాలున్నాయి. అందుకే ప్రధాని మోదీ మౌనముద్రవేసుకున్నారు. నూతన ఆర్థిక విధానాలు, సరళీకృత పోకడలతో అన్ని రాష్ట్రాల్లో సమగ్రాభివృద్ధి సాధించడమొక్కటే ఆయన ముందున్న ఏకైక మార్గం. మరో ముఖ్యమైన విషయమేమంటే, చట్టపరంగా ఏవైనా మార్పులు తీసుకురావాలంటే రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి తగినంత బలం ఉండాలి. లేకపోతే కీలక బిల్లులు చట్టరూపం దాల్చకముందే వెనక్కిపోతాయి. బిహార్ ఎన్నికలు, అలాగే వచ్చే రెండేళ్లలో (2016, 2017) వివిధ రాష్ట్రాల్లో (అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా) జరిగే ఎన్నికలు మోదీకి కీలకంగా మారాయి. తాను కోరుకున్న రాష్ట్రాలకు చేయూతనిచ్చేందుకు చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పార్లమెంట్ లో బలం పెంచుకోకతప్పదు. ప్రత్యేక హోదాను ఇవ్వకపోయినా, దానికి తగిన స్థాయిలో మరో హోదాను ఇవ్వాలన్నది మోదీ ఆలోచనలా ఉంది. అయితే ఇది సాధ్యంకావాలంటే ప్రత్యేక బిల్లు తీసుకువచ్చి, దానికి చట్టరూపం ఇవ్వాలి. అది జరగాలంటే పార్లమెంట్ లో బిల్ పాసవ్వాలి. లోక్ సభలో బలం బాగానే ఉన్నా, రాజ్యసభలో ఏన్డీయేకి బలం తగినంత లేదు. అది రావాలంటే వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో బలం పెంచుకోవాలి. అప్పుడే ఆయన వ్యూహం సిద్ధిస్తుంది. అంటే, ప్రత్యేక హోదా కాకపోయినప్పటికీ, అలాంటి మరో హోదాను రాష్ట్రానికి ఇవ్వాలంటే, కొత్త చట్టం తీసురావాల్సిందే. దీనికి రెండేళ్లు పడుతుంది. ముందుగా బిల్లు ప్రవేశపెట్టాలి. ఆ తర్వాత దాన్ని పార్లమెంట్ లో పాస్ చేయించాలి. రాష్ట్రపతి ముద్రతో బిల్లు చట్టంగా మారాలి. ఈలోగా ప్యాకేజీలే మనకున్న ఏకైక ఆశ. అందుకే చంద్రబాబు దీనిపై ఫోకస్ చేస్తున్నారు. మరో పక్క జగన్మోహన్ రెడ్డికి కూడా ఈ ఆర్థిక సూత్రాలు బాగానే తెలుసు. కాకపోతే ఏదారీలేకపోతే డొంకదారే రహదారన్నట్టుగా ఆయన హోదాను పట్టుకుని రాజకీయలబ్ది పొందాలని చూస్తున్నారు. మరో పక్క మోదీ ఇదంతా మౌన ప్రేక్షకునిగా మారిపోయారు.
– కణ్వస