హైదరాబాద్లో ఉండేవారు కాస్త దూరం అయినా ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికిప్పుడు తమ బడ్జెట్ సరిపోకపోయినా భవిష్యత్ శివారుకు మారాలన్న ఆలోచన ఉన్న వారు ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలో ఉన్న వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ వృద్ధి వచ్చే పదేళ్లలో ఊహించనంతగా ఉంటుందన్న అంచనాలతో స్థలాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఎక్కడెక్కడ, ఎంతెంత రేట్లు ఉన్నాయో ఓ పరిశీలిద్దాం.
హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల నలభై, యాభై కిలోమీటర్ల వరకూ స్థలాలు ఎప్పుడో బంగారం అయ్యాయి. అయినా ఇప్పటికి రూ. ఇరవై వేల నుంచి పాతిక వేల వరకూ గజంస్థలం అందుబాటులో ఉన్న స్థలాలు ఉన్నాయి. పెద్ద అంబర్పేట్ దగ్గర చ.గ. రూ. 20-25 వేలకు లభిస్తోంది. కీసర దగ్గర కూడా అదే ధర ఉంది. ఇక సాగర్ రోడులో బొంగ్లూరు, పటాన్ చెరు వద్ద సుల్తాన్పూర్ లలో పాతిక నుంచి 30 వేల మధ్య ధరల్లో స్థలాలు లభిస్తున్నాయి. ఇక ముంబై హైవేలో ముత్తంగి, మల్లంపేట వద్ద 30 వేల నుంచి నలభై వేల రూపాయలకు స్థలాలు లభిస్తున్నాయి. మేడ్చల్ ,షామీర్ పేట ప్రాంతాల్లోనూ ఇదే రేటు ఉంది.
ఘట్కేసర్ దగ్గర కాస్త లోపలికి ఇరవై వేలకు కుడా ఉన్నాయి. ముఫ్ఫై వేలు చదరపు గజానికి వెచ్చిస్తే మంచి ఏరియాలో ప్లాట్వస్తుంది. తారామతిపేట్, రావిర్యాల గ్రామాల్లో ముఫ్ఫైఐదువేల వరకూ ఉంది. దుడింగల్ వద్ద కూడా అదే ధర ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఔటర్ చుట్టుపక్కల అత్యంత ఖరీదైన ప్రాంతాలుగా కొల్లూరు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ గజంస్థలం ఏరియాను బట్టి అరవై వేల నుంచి రెండు లక్షలా వరకూ ఉంది..