హైదరాబాద్‌లో 20 నెలల కిందట ప్రారంభమైన ఓ రియల్ఎస్టేట్ కంపెనీలో రూ. కోట్ల నగదు పట్టుబడటం ఇప్పుడు సంచలనం అవుతోంది. సాధారణంగా ఐటీ వర్గాలు దాడులు చేస్తాయి కానీ… ఎవరిపై దాడులు చేశామన్న విషయాలను మాత్రం మీడియాకు చెప్పరు. ఈ క్రమంలో ఆ సంస్థ నిన్నామొన్న ప్రారంభించినది కావడంతో పెద్దగా హైలెట్ కాలేదు. కానీ వారి దగ్గర దొరికిన నగదు.. భారీ లావాదేవీల వివరాలు చూసి ఐటీ అధికారలే షాక్‌కు గురవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మొత్తంగా అసలు ఆ సంస్థలోకి నగదు ఎలా వచ్చిందన్నదన్నది లెక్కలు తీస్తున్నట్లుగా చెబుతున్నారు.
బ్లాక్ మనీ పోగుపడేది రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర లేదా.. కమిషన్లు వసూలు చేసే రాజకీయ నాయకుల దగ్గర. రాజకీయ నాయకులు కూడా తమ బ్లాక్ మనీని రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకే పంపుతూంటారు. అలానే వచ్చిందని ఐటీ అధికారులు పక్కా సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు ఇటీవల ప్రభుత్వం తరపున ఓ ప్రయోజనం కల్పించి.. ఆ మేరకు వసూలు చేసిన కమిషన్‌ను ఈ కంపెనీలోకి పెట్టుబడిగా పంపారని అనుమానిస్తున్నారు. ప్రభుత్వం తరపున ప్రయోజనం పొందిన కంపెనీ ఇప్పుడు మొత్తంగా ఇరుక్కుపోయింది. ఆ కంపెనీపైనా ఐటీ దృష్టి పడే చాన్స్ కనిపిస్తోంది.
అయితే అంతిమంగా ఆ రాజకీయ నాయకుడు బయటకు వస్తారా అన్నది మాత్రం సస్పెన్స్ . ఎందుకంటే ఇప్పటి వరకూ ఎన్నో ఐటీ దాడులు జరిగాయి కానీ.. ఫలనా కంపెనీలో పెట్టుబడులు.. బ్లాక్ మనీ దొరికాయి.. ఇది ఫలానా రాజకీయ నేతది అని ఐటీ ఎప్పుడూ ప్రకటించలేదు. ఆధారాలు ఉన్నా కూడా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు రాజకీయం మారుతోంది కాబట్టి ప్రకటిస్తారేమో వేచి చూడాలి !