అసలే కరోనా.. ఆ పైన ఉపాధి దెబ్బకొట్టింది.. అయినా తెలంగాణలో రియల్ ఎస్టేట్ మాత్రం జోరు మీద ఉంది. అక్కడి ప్రభుత్వానికి అంచనాలకు మించి రిజిస్ట్రే,షన్ల ఆదాయం తెప్పిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకూ తెలంగాణ మొత్తంగా పది లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో పొలాల వాటా చాలా తక్కువ. 80 శాతం ఇళ్లు.. ఇళ్ల స్థలాలా లావాదేవీలే. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఏప్రిల్, మే నెలల్లో కొవిడ్ ప్రభావంతో సుమారు 50 రోజులు రిజిస్ట్రేషన్లు చేయలేదు. మధ్యలో కొన్నాళ్లు ధరణి పేరుతో ఆపేశారు.
అయినప్పటికీ ఆదాయంపై ఏ మాత్రం ప్రభావం పడలేదు. రోజుకు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల ఆదాయం ప్రభుత్వం కళ్ల జూస్తోంది. పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ దూకుడు నేపథ్యంలో భూములు, స్థలాలు, ఇళ్ల క్రయ విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలతో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ సహా వివిధ కొత్త జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ జోరందుకుంది.
పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రియల్ ఎస్టేట్ అనువైన మార్గంగా ఎక్కువ మంది భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వృద్ధి ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు. దాంతో.. పెట్టుబడులకు సరైన మార్గం హైదరాబాద్ అని భావిస్తున్నారు. అమరావతిలో అభివృద్ధి అంతా ఆగిపోవడంతో.. అక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్నవారు కూడా .. తిరిగి హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఫలితంగా తెలంగాణకు ఆదాయం భారీగా పెరుగుతోంది.