హైడ్రా ఇక ముందు కూల్చివేతలు చేపట్టేది కొత్తగా చేసే ఆక్రమణలు, అనుమతులు లేనివాటినేనని కమిషనర్ రంగనాథ్ చాలా స్పష్టంగా చెప్పారు. హైడ్రా ఏర్పాటు చేసిన జూలై నుంచి మాత్రమే తాము పరిగణనలోకి తీసుకుంటామని అంతకు ముందు జరిగిన ఆక్రమణలు, ఇతర విషాయాల పట్ల హైడ్రాకు పట్టింపు లేదని ఆయన చెప్పినట్లయింది. అంటే పాత కబ్జాలు, ఇతర ఆక్రమణలు.. ఉల్లంఘనలు అన్నీ జీహెచ్ఎంసీ చూసుకుంటుంది. లేకపోతే హెచ్ఎండీఏ చూసుకుంటుంది. హైడ్రా మాత్రం గత జూలై నుంచి జరిగిన వాటి విషయంలో మాత్రమే యాక్షన్ తీసుకుంటుంది.
హైదరాబాద్లో ఇళ్ల కొనుగోలుదారులు కాస్త ముందూ వెనుకాడుతూండటానికి కారణాల్లో ఒకటి హైడ్రా. ప్రభుత్వం ఒప్పుకోక పోవచ్చు కానీ అన్ని అనుమతులు ఉన్న ఇళ్లను అమీన్ పూర్లో కూల్చివేయడంతో సమస్య వచ్చింది. సర్వే నెంబర్ వేరుగా చూపించి ప్రభుత్వ భూమిలో ఆ ఇళ్లు కట్టేశారు. అయినా కట్టి .. హోమ్ లోన్లు తెచ్చుకుని గృహప్రవేశాలు చేసేదాకా అధికారులకు తెలియదా?. అందరికీ అన్నీ తెలుసు. ఈ పాపంలో అందరూ భాగస్వాములే. అయితే బాధితుడు మాత్రం చివరికి కొనుగోలుదారుడు. అది ఒక్క సారిగా పానిక్ సృష్టించింది.
ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. చట్టబద్దత వచ్చినప్పటికీ బుల్డోజర్లను బయటకు తీయడం లేదు. ఇటీవల ఎక్కడైనా ఆక్రమణలకు పాల్పడినట్లుగా సమాచారం వస్తే వెళ్లి కూల్చేస్తున్నారు. వాటి విషయంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండటం లేదు. రంగనాథ్ ఇచ్చిన క్లారిటీతో కొనుగోలుదారులలో విశ్వాసం పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా చాలా రోజులుగా ఇదే చెబుతున్నా.. ఎవరికీ నమ్మకం కలగడం లేదు. హైడ్రా కమిషనరేట్ చెప్పారు కాబట్టి పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.