రియల్ ఎస్టేట్ రంగంలో సొంతంగా ఇళ్లు కొనాలనుకునేవారు ఎక్కువగా ఉంటారు. అయితే తమ ఆదాయాన్ని పెట్టుబడుల రూపంలో రియల్ రంగంలో పెట్టాలనుకునేవారూ ఎక్కువగానే ఉంటారు. మోసగాళ్లు ఇలాంటి వారిని వినూత్నమైన మద్దతుల్లో ట్రాప్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కమర్షియల్ ప్రాపర్టీస్ పేరుతో మోసం చేయడం ప్రారంభించారు. ఓ అందమైన భవనం డిజైన్ చూపించి.. ఇది ఫలానా చోట నిర్మించబోతున్నామని.. పెట్టుబడి పెడితే.. అందులో కొంత స్థలం రిజిస్ట్రేషన్ చేస్తామని ..అది అద్దెకు ఇచ్చుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందని ప్రచార చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి ప్రకటనలు కనిపిస్తున్నాయి. యాభై లక్షలు పెట్టుబడి పెడితే నెలకు యాభై వేల రెంట్ వస్తుందని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. మరికొందరు అంతకు మించి ఆఫర్లు ఇస్తున్నారు. వీరు చెప్పే కమర్షియల్ ప్రాజెక్టులన్నీ అత్యంత బిజీ ఏరియాలో ఉండేవే. అలాంటి ఏరియాలో స్థలం ఉంటే వీరు ఇలా సోషల్ మీడియాలో చీప్ ప్రమోషన్లు ఎందుకు చేస్తారో ఎవరికీ అర్థంకాదు.ఇలాంటి సంస్థలు చాలా వరకూ మోసపూరితమైనవే. వాటిని సులువుగా కనిపెట్టడం కూడా ఈజీనే. వారికి బ్యాంకు లోన్లు రావు. అందుకే మొత్తం ఒక్క సారే అమౌంట్ కట్టాలని ఒత్తిడిచేస్తాయి. అలా పెట్టుబడి పెట్టిన వారికి మాత్రమే ఈ బంపర్ ఆఫర్ అంటూ హడావుడి పెడతాయి.
ముందుగానే డబ్బులు కట్టాలి… బ్యాంకు లోన్లు రావు అని ఎవరైనా అంటే.. ఖచ్చితంగా అతి మోసమే. అలాంటి వాటి ట్రాప్ లో పడితే కష్టార్జితం అంతా గాయబ్ అవుతుంది. సాధారణంగా బడా సంస్థలకు కమర్షియల్ ప్లాట్లు ఉంటే.. ఇలా డిపాజిట్లు సేకరించి.. నిర్మాణాలు చేయరు. నిబంధనలకు విరుద్ధంగా అసలు స్థలం ఉందో లేదో కూడా తెలియకుండా కోట్లు వసూలు చేయాలనుకోరు. రియల్ ఎస్టేట్ మోసాలు చేసే వాళ్లకు పోయేదేమీ ఉండదు. డబ్బులు వసూలు చేసి అరెస్టు అయి కొద్ది రోజుల్లో జైల్లో ఉండి బయటకు వస్తారు. కానీ నష్టపోయిన వారు మాత్రం తమ జీవితాన్ని మోసపోయిన ఈఎంఐలకు కేటాయించాల్సి వస్తుంది.