రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం అంటే మోసమే అన్నట్లుగా ఉండే వారికి భారతీయ న్యాయ సంహిత అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. దానికి తాజా కేసే ఉదాహరణ. మోకిల్లాలో కంట్రీసైడ్ రియల్టర్స్ అనే కంపెనీపై కొనుగోలుదారులు అందరూ కేసులు పెట్టారు. హెచ్ఎండీఏ పర్మిషన్ ఉందని అబద్దాలు చెప్పారని, కల్పిస్తామని హామీ ఇచ్చిన సౌకర్యాలు కల్పించలేదని.. పైగా మెయింటనెన్స్ కోసం వసూలు చేస్తున్న సొమ్మును పక్కదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
మోకిల్లాలో కంట్రీసైడ్ రియల్టర్స్ సంస్థ ఓ విల్లా ప్రాజెక్టు చేపట్టింది. అందులో 117 వరకూ విల్లాలు ఉన్నాయి. పదేళ్ల కిందటే హెచ్ఎండీఏ పర్మిషన్ ఉందని నమ్మించి అమ్మకాలు చేశారు. వాటర్ సీవేజ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని.. పూర్తి సెక్యూరిటీతో గెటేడ్ కమ్యూనిటీని నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఆ ఇళ్లల్లో ఉంటున్న వారిలో ఎనభై శాతం మందికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రాలేదు. ఎందుకంటే హెచ్ఎండీఏ పర్మిషన్ ప్రక్రియ మధ్యలో ఆగిపోయింది. కంపెనీ పట్టించుకోలేదు. ఫలితంగా ఇప్పుడు ఓసీ రావడం లేదు.
అదే సమయంలో కల్పించాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడం.. గేటెడ్ కమ్యూనిటీ మెయిన్టనెన్స్ పేరుతో ప్రతి ఫ్లాట్‌కు కనీసం రూ. ఎనిమిది వేలు వసూలు చేస్తున్నారు. ఆ సొమ్ము అంతా విల్లా వేల్ ఫేస్ సొసైటీ ఖాతాలో కాకుండా వేరే ఖాతాకు మళ్లించుకుంటున్నారు. ఇవన్నీ గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. విచారణ జరిపిన పోలీసులు నిజమేనని తేల్చి కేసులు నమోదు చేశారు.
నిజానికి ఇలాంటి ఫిర్యాదులు ప్రతి విల్లా ప్రాజెక్టు నుంచి వస్తూంటాయి. బిల్డర్లు, వ్యాపారులు అంతా అమ్మేసుకున్న తర్వాత వీలైనంత వరకూ డబ్బులు మిగిల్చుకోవడానికి చాలా పనులు పెండింగ్ పెట్టేస్తారు. కేసులు పెట్టినా కోర్టుల చుట్టూ తిరగలేమని చాలా మంది ఎక్స్ ట్రా ఖర్చు పెట్టుకుని ఆ పనులు పూర్తి చేసుకుంటారు. అలాంటి అవసరం లేదని.. పోలీసులకు ఫిర్యాదు చేసి వారి మోసాన్ని బయట పెట్టవచ్చని మోకిలా ప్రాజెక్టు ఓనర్లు అందరూ గుర్తించేలా చేశారు.