హైదరాబాద్ లో ఇప్పుడు ఇల్లు అనేది ఎగువ మధ్యతరగతి వారికి కూడా ఓ సుదూర స్వప్నంలా మారింది. మధ్యతరగతి ప్రజలు.. రోజ వారీ కుటుంబ ఖర్చులను భరిస్తూ ఇల్లుకొనడం అనేది ఓ పెద్ద టాస్క్. ఇప్పుడు యాభై, అరవై లక్షలకు రీసేల్ అపార్టుమెంట్లు దొరకడం కూడా కష్టం. కానీ కొన్ని ప్రాంతాల్లో కొత్త ఇళ్లే లభిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒకటి చందానగర్ నుంచి ఓఆర్అర్ వైపు వెళ్లే రోడ్. అమీన్ పూర్ కిందకు వచ్చే ఈ ప్రాంతంలో ఎక్కువగా నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఆరేడేళ్ల కిందటి వరకూ అమీన్ పూర్ వైపు రియల్ ఎస్టేట్ పెట్టుబడి కోసమే అన్నట్లుగా ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో అక్కడ కాలనీలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పుడు బిజీగా మారిపోయింది. బీహెచ్ఈఎల్ దగ్గర శ్రీదేవి ధియేటర్ దగ్గర నుంచి అమీన్ పూర్ మీదుగా ఓఆర్ఆర్కు వెళ్లే దారిలో కొన్ని వందల ఇళ్లు, అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. ఇక్కడ సౌకర్యాలు కూడా బాగానే ఉంటాయి. దగ్గరలోనే చందానగర్ ఉండటంతో విద్యా, వైద్య సౌకర్యాలకు ఇబ్బంది లేదు. అమీన్ పూర్ మున్సిపాలిటీ గా ఉండటంతో మంచినీరు… ఇతర సౌకర్యాలను కల్పించే విషయంలో పురోగతి కనిపిస్తోంది.
ఇక్కడ అపార్టుమెంట్లు సైజును బట్టి యాభై లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. అరవై లక్షలకు మంచి సౌకర్యాలు ఉన్న డబుల్ బెడ్ రూం అపార్టుమెంట్ వస్తుంది. అందుకే ఉద్యోగానికి..ఇతర ఉపాధికి కాస్త దూరం అయినా ఎక్కువ మంది ఈ ఏరియాకు వచ్చి ఇళ్లను చూసుకుంటున్నారు. ఈ డిమాండ్ ఇలా పెరిగితే ఇది కూడా మధ్యతరగతి ప్రజలకు దూరం అవుతుందన్న అభిప్రాయం రియల్ ఎస్టేట్ వర్గాల్లో వినిపిస్తోంది.