అమరావతికి మళ్లీ మంచి రోజులు రావడంతో హైదరాబాద్ పెట్టుబడులన్నీ అటుపోతాయని కొంత మంది అత్యుత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఎవరి అభివృద్ధి వారిదేనని తాజాగా గణాంకాలు నిరూపిస్తున్నాయి. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ఎన్నికల కారణం మందగిలించిన అమ్మకాలు, కొనుగోళ్లు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య పన్నెండు శాతం పెరిగింది.
ఇళ్ల కొనుగోళ్లు తగ్గిపోయాయని బయట ప్రచారం చేస్తున్నారు కానీ లెక్కల్లో చూస్తే అవి పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఆరు నెలల్లో 54 వేల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2023 మొదట ఆరు నెలల్లో జరిగిన రిజిస్ట్రేషన్లు 50 వేలు మాత్రమే. అంటే బలమైన వృద్ధి ఉన్నట్లే. ఇక కొత్త ప్రాజెక్టులకు అనుమతులు కావాలని పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి.
హైదరాబాద్ అభివృద్ధి కోసం రేవంత్ ప్రత్యేమైన ప్రణాళికల్లో ఉన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును సీరియస్ గా తీసుకున్నారు. మెట్రో రైలు పనుల్లో వేగం పెంచుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పనులు కూడా ఊపందుకోవటంతో సిటీకి నాలుగువైపులా రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.