మధ్యతరగతి ప్రజలు తాము రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన సొమ్మును అత్యంత సురక్షిత మార్గాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ఆ సురక్షిత మార్గాలు స్టాక్ మార్కెట్ కాదు.. ఇది అందరికీ అవగాహన ఉండదు. పైగా సురక్షితం కాదు. ఇతర మార్గాల్లోనూ రిస్కులు ఉంటాయి. అవేమీ లేకుండా ఉండే రెండే రెండు మార్గాలు రియల్ ఎస్టేట్, గోల్డ్.
ఈ రెండు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవు. కాస్త జాగ్రత్తగా ఉంటే మోసపోయే అవకాశాలు కూడా ఉండవు. అందుకే మధ్యతరగతి ప్రజులు ఈ రెండింటిలో దేనిపై పెట్టుబడి ఎక్కువగా పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కాస్త అందుబాటులో నగదు ఎక్కువగా ఉన్న వారు స్థలాలు కొంటున్నారు. తక్కువగా ఉన్న వారు బంగారం కొంటున్నారు. వాటికి మంచి రిటర్నులు కూడా పొందుతున్నారు.
రెండేళ్ల కిందట బంగారం ధర ఎంత ?. పది గ్రాముల బంగారం రూ. యాభై వేల దరి దాపుల్లో ఉండేది. రెండేళ్లలో అది రూ. ఎనభై వేలకు చేరింది. అంటే.. ఓ వంద గ్రాముల బంగారాన్ని రూ. ఐదు లక్షలు పెట్టి కొనుగోలు చేసి ఉంటే..రెండేళ్లలో దాని విలువ ఎనిమిది లక్షలు అయింది. ఎవరి దగ్గరో డబ్బులు డిపాజిట్ చేయకుండా.. ఎవరో ఏదో ఇచ్చేస్తారని ఆశపడకుండా సొంతంగా తమ ఎదురుగానే సొమ్మును ఉంచుకుని విలువను పెంచుకోవడం ఇది. ఇదే విధంగా భూమి విషయంలోనూ రిటర్న్స్ పొందవచ్చు కానీ.. భూమికి ఇంకా ఎక్కువ పెట్టుబడి కావాలి. పైగా డబుల్ రిటర్న్స్ రావాలంటే రెండేళ్ల కాలం సరిపోదు.. ఇంకా ఎక్కువ సమయం వేచి చూడాలి.
కొత్త తరం ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది. వారిలో అధికాదాయ వర్గాలు ఉండటమే దీనికి కారణం. తర్వాత స్టాక్ మార్కెట్ వైపు చూస్తున్నారు. బంగారంలో పెట్టుబడులు.. ఎక్కువగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతితో పాటు దిగువ మధ్యతరగతి కూడా తమ స్థాయికి తగ్గట్లుగా పెడుతున్నారు. అందుకే గోల్డ్ డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది.