సుకుమార్ ఎంచుకొనే జోనర్లు కాస్త డిఫరెంట్గా ఉంటుంటాయి. ఆర్య తరవాత పూర్తి స్థాయి ప్రేమ కథ తీయలేదు. 100 % లవ్ తరవాత ఈగో జోలికి వెళ్లలేదు. వన్ – నేనొక్కడినే కూడా డిఫరెంట్ సినిమానే. ఇప్పుడు ‘రంగస్థలం’ కోసం తన జోనర్ మార్చాడు. ‘రంగస్థలం’ అనగానే ఇదేదో నాటకాల నేపథ్యంలో సాగే సినిమా అనుకొన్నారంతా. రామ్ చరణ్ చెవిటివాడి పాత్రలో కనిపిస్తాడన్న ప్రచారం కూడా సాగింది. అయితే… అదేం కాదు. ఇదో పక్కా కమర్షియల్ సినిమా. ఇప్పుడు జోనర్ ఏంటన్నది కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా రాజకీయాల నేపథ్యంలో సాగుతుందట. కుర్చీ కోసం.. ఎవరెన్ని ఎత్తులు వేశారో, ఎవరు చిత్తయ్యారో ఈ సినిమాలో చూపించబోతున్నాడట సుకుమార్. పల్లెటూరు రాజకీయాల చుట్టూ ‘రంగస్థలం’ నడవబోతోందని, ఎమోషన్స్కీ చోటిచ్చాడని తెలుస్తోంది. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంఓ జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబరు నాటికి చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ డ్రామా ఎంత వరకూ రక్తి కడుతుందో చూడాలి.