స్వాతంత్ర్యసమరయోధుడు, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికీ ప్రత్యేకమైన గౌరవమర్యాదలు ఉంటాయి. ఆయన సేవలు అలాంటివి. అయితే తరాలు మారుతున్న కొద్దీ ఆయన గొప్పతనాన్ని వారసత్వంగా ప్రజలకు అందించే విషయంలో ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. గత ఐదేళ్లు కొంత ప్రయత్నం జరుగుతున్నా.. ఇప్పుడు ఆయన వారసత్వం మాదంటే మాదేనని కొట్లాటలకు దిగడంతో వివాదాస్పదమవుతోంది. కాకాని వెంకటరత్నం ఆస్తులకు బంధువులు వారసులుగా ఉంటారని.. ఆశయాలు పాటించేవారే అసలైన వారసులు. కానీ ఆయన వారసులు మాత్రం రాజకీయ కారణాలతో కాకాని వెంకటరత్నంను వివాదాల్లోకి లాగేస్తున్నారు.
జైఆంధ్ర ఉద్యమం కోసం ప్రాణాలు వదిలిన కాకాని వెంకటరత్నం
ఉమ్మడి కృష్ణా జిల్లాపై తనదైన ముద్ర వేసిన నేత కాకాని వెంకటరరత్నం . 1924 నుంచి ప్రజల కోసం పని చేశారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండేళ్లు జైలుకెళ్లారు. తర్వాత ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. జైలుకెళ్లారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషించారు. రెండు సార్లు పీసీసీ చీఫ్ అయ్యారు. ఉయ్యూరు ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచారు. కాసు బ్రాహ్మానందరెడ్డి, పీవీ మంత్రి వర్గాల్లో మినిస్టర్ గా పని చేశారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమంలో భాగంగా మంత్రిపదవికి రాజీనామా చేశారు. జై ఆంధ్రా ఉద్యమం లో విధ్యార్దుల పై పోలీసు కాల్పులు జరిగి విధ్యార్దులు మరణించారన్న వార్త విని వీరు 1972, డిసెంబరు 25న గుండెపోటుతో మరణించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ అసలు పేరు కాకాని సర్కిల్. అక్కడ విగ్రహం నెలకొల్పారు.
ఘన చరిత్ర ఉన్న కాకాని గురించి అందరూ మర్చిపోయేలా చేసిన వారసులు
ఇంతటి ఘన చరిత్ర ఉన్న కాకాని వెంకటరత్నం గొప్పతనాన్ని భావితరాలకు తెలిసేలా చేయడంలో ఆయన వారసులు విఫలమయ్యారు. ఆయన ఆస్తులు పంచుకుని ఎవరు పని వారు చేసుకుంటున్నారు. చివరికి ఆయన జయంతి, వర్థంతులను కూడా పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇలాంటి సందర్భంలో రోడ్డు విస్తరణ కోసం విగ్రహాన్ని తొలగించారు. అప్పుడు కూడా బంధువుల వారసులు పట్టించుకోలేదు. కానీ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, కాకాని వెంకటరరత్నం కుటుంబానికి దూరపు బంధువు కాకాని తరుణ్ మాత్రం.. మళ్లీ విగ్రహ ప్రతిష్ట కోసం పోరాడారు. చివరికి అనుకున్నది సాధించారు. అయితే ఈ విగ్రహం కేంద్రంగానే వివాదాలు ప్రారంభమయ్యాయి. కాకాని వారసులం తామేనని కాకాని తరుణ్ ఎవరంటూ వాదులాటకు దిగారు.
ఆశయాలకు వారసుడిగా వచ్చిన కాకాని తరుణ్
కాకాని ఆశయాలను ఆయన గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆస్తులు, రక్తం పంచుకున్న వారసులు ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఇప్పుడు దూరపు బంధువు అయిన కాకాని తరుణ్ ప్రయత్నిస్తూంటే.. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్నారంటూ.. . వారసుల పేరుతో వచ్చి హడావుడి చేశారు. నిజానికి నివాళులు అర్పించడానికి.. వారసులే అయి ఉండాలా అన్న డౌట్ ఎవరికైనా వస్తుంది. కాకాని తరుణ్ విగ్రహా ప్రతిష్టాపన కోసం కృషి చేశారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సంకల్పంతో ఉన్నారు. ఆయన ఆశయాలకు వారసులుగా మారడానికి… బంధువులే అయి ఉండాల్సిన పని లేదు. బంధువుగా కాకుండా.. సమకాలిన రాజకీయంలో కాకాని గొప్పతనాన్ని ప్రజలకు చేరేవేసేందుకు తాను ప్రయత్నిస్తున్నానని కాకాని తురణ్ చెబుతున్నారు.
కాకాని వారసుల తీరుపై విమర్శలు
కాకాని వెంకటరత్నం ప్రజల కోసం పని చేశారు. కుటుంబం కోసం కాదు. ఆయన అందరి మనిషి. వారసత్వాలు ఆస్తుల వరకే ఉంటాయి.రాజకీయ ఆశయాలకు వారసులు కుటుంబసభ్యులు కాదు. ఆయనను తమ ఆస్తిగా చెప్పుకుని రాజకీయ భవిష్యత్ నిర్మించుకోవాలనుకుంటే.. వారుసులు ఇంతకు ముందే ఆయన గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం ఎక్కువగా వినినిపిస్తోంది. కాకాని తరుణ్ ప్రయత్నాలను పలువురు అభినందిస్తున్నారు.