వెండి తెరపై మాస్టారు హోదాలో బెత్తం పట్టుకొని పాఠాలు చెప్పినవాళ్లు చాలామందే ఉన్నారు. అగ్ర హీరోలు సైతం…. టీచర్ పాత్రని అవలీలగా పోషించేశారు. నిజ జీవితంలోనూ కొంతమంది స్టార్లు ఉపాధ్యాయులుగా రాణించారు. ముందు పాఠాలు చెప్పే.. ఆ తరవాత.. వెండి తెరపై డైలాగులు వల్లించారు. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం. ఈ సందర్భంగా నిజ జీవితంలో పాఠాలు చెప్పిన సినీ సెలబ్రెటీల లిస్టు ఒక్కసారి బయటకు తీస్తే….
త్రివిక్రమ్ కొంతకాలం టీచర్‌గా పని చేశారు. ప్రముఖ నటుడు గౌతమ్ రాజు అబ్బాయికి ఆయన ప్రైవేటు పాఠాలు చెప్పారు. అదీ కేవలం పాకెట్ మనీ కోసమే. గౌతమ్ రాజు ఇంట్లో పాఠాలు చెబుతూనే, సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు. సుకుమార్ లెక్కల మాస్టారు అనే సంగతి తెలిసిందే. కాకినాడలో కొన్నేళ్ల పాటు ఆయన మాథ్స్ లెక్చరర్‌గా పనిచేశారు. ఆ ఉద్యోగం మానేసిన తరవాతే ఆయన సినిమాల్లో రాణించడం మొదలెట్టారు. తన స్టూడెంట్స్ కూడా కొంతమంది ఇప్పుడు చిత్ర రంగంలోనే ఉన్నారు. హాస్య నటులు బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ కూడా గురువులుగా పనిచేశారు. వీరిద్దరూ తెలుగులో టాప్. బ్రహ్మానందం అత్తిలిలో ఉద్యోగం చేస్తూనే సినిమా అవకాశాల కోసం వెదికారు. ఆయన కొంతకాలం అటు ఉద్యోగం, ఇటు సినిమా వేషాలు అంటూ బాలెన్స్ చేశారు. తనికెళ్ల భరణి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో పాఠాలు చెప్పారు. రచయిత పరుచూరి గోపాల కృష్ణ కూడా కొంతకాలం టీచర్‌గా పనిచేసినవారే. బ్లాక్ అండ్ వైట్ కాలంలోకి వెళ్తే… జగ్గయ్య, రాజబాబు కూడా కొంతకాలం ఉపాధ్యాయులుగా పని చేశారు.