24 విభాగాలకు చెందిన సినీ కార్మికులు ఈరోజు నుంచి బంద్ కి పిలుపునిచ్చారు. దాంతో షూటింగులు ఆగిపోయాయి. ప్రతీ మూడేళ్లకు ఓసారి సినీ కార్మికుల వేతనాలు పెంచడం పరిపాటి. చివరి సారి 2018లో వేతనాలు పెంచారు. మళ్లీ 2021లో పెంచాలి. కానీ… కరోనా సమస్యలతో సినిమాలు ఆగిపోయాయి. దాంతో నిర్మాతలకు ఈ విషయం గురించి ఆలోచించలేదు. సినీ కార్మికులు అడిగితే… `చిత్రీకరణలు ఊపందుకోనివ్వండి.. అప్పుడు చూద్దాం` అని మాటిచ్చారు. కరోనా సమస్యలు తొలగి, షూటింగులు జోరందుకొన్నాయి. దాంతో.. ఈ వేతనాల సమస్య ముందుకొచ్చింది.
సాధారణంగా… మూడేళ్లకోసారి 30 శాతం వేతనం పెంచడం ఆనవాయితీగా వస్తోంది. 2021లో పెంచాల్సిన వేతనాలు ఇంకా పెంచలేదు కాబట్టి.. ఈసారి 45 శాతం పెంచాలన్నది కార్మికుల డిమాండ్. కొన్నాళ్ల నుంచీ ఫెడరేషన్ ఈ ప్రతిపాదన చేస్తూ వస్తోంది. దీనిపై కూడా నిర్మాతలు ఆలోచిస్తున్నారు. కానీ సడన్ గా బంద్‌కి పిలుపు ఇవ్వడం, షూటింగులు ఆపేయడంతో నిర్మాతలకు ఏం పాలుపోవడం లేదు. కనీసం 15 రోజుల ముందస్తు సమాచారం లేకుండా బంద్ ప్రకటించడం కరెక్ట్ కాదన్నది నిర్మాతల వాదన. అందుకే.. ఈ రోజు ఫెడరేషన్ బంద్ కి పిలుపునిచ్చినా, కొన్ని షూటింగులు యధాతధంగా సాగుతున్నాయి. “15 రోజుల ముందే నోటీసు ఇవ్వలేదు కాబట్టి.. షూటింగుల్ని అడ్డుకొనే హక్కు మీకు లేదు“ అని ఛాంబర్ గట్టిగానే చెబుతోంది.
మరోవైపు ఫైటర్స్ యూనియన్‌తో నిర్మాతలకు పాత గొడవలు ఉన్నాయి. ఆమధ్య వేతనాలు పెంచాలని ఫైటర్లు డిమాండ్‌కి దిగారు. ఒక్కసారిగా షూటింగులకు డుమ్మా కొట్టారు. ఆ సమయంలో షూటింగ్ జరుపుకొంటున్న వివిధ చిత్రాలు ఫైటర్ల బంద్ తో ఒక్కసారిగా ఆగిపోయాయి. దాంతో నిర్మాతలకు చాలా నష్టం వాటిల్లింది. వ్యక్తిగత గొడవలతోనే ఫైటర్లు బంద్ కు పిలుపు ఇచ్చారని, దాని వల్ల.. నిర్మాతలు చాలా నష్టపోయారని, ముందు ఆ విషయం తేలేంత వరకూ సినీ కార్మికుల వేతనాల గురించి ఆలోచించేది లేదని ఛాంబర్ సభ్యులు చెబుతున్నారు. అసలు ఫైటర్ల గొడవేంటి? వాళ్లెందుకు బంద్ కు పిలుపునిచ్చారు? అనే విషయాలు ఇప్పుడు తేలాల్సివుంది. సినీ కార్మికుల వేతనాల పెంపు అసలు సమస్యే కాదని, కానీ… నిరసన తెలిపే పద్ధతి ఇది కాదని, 15 రోజుల ముందస్తు నోటీసు లేకుండా షూటింగులు ఆపేయడం తగదని నిర్మాతలు వాదిస్తున్నారు. లెక్క ప్రకారం పెంచాల్సిన 30 శాతం పెంచుతామని, అంతేగానీ 45 శాతం పెంచాలనడం భావ్యం కాదన్నది వారి వాదన.