ఏపీ రాజధాని అమరావతి ఇప్పుడు మధ్యతరగతికి కూడా అందుబాటులోఉంది. 2014-19మధ్య వచ్చిన హైప్ కారణంగా పెరగాల్సిన ధరలన్నీ అప్పట్లోనే పెరిగాయి. ఆ తర్వాత ఐదు సంవత్సరాల పాటు కదలిక లేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ కదలికలు ప్రారంభమయ్యాయి. గతంలో ప్రారంభించి మధ్యలో ఆపేసిన ప్రాజెక్టులన్నీ తెరపైకి వస్తున్నాయి. వాటిలో కొనుగోలు కోసం ఎంక్వయిరీలు ప్రారంభమవుతున్నాయి.
నిజానికి గతంలో అపర్ణ, వెర్టెక్స్, జయభేరీ వంటి కంపెనీలు పెద్ద పెద్ద అపార్టుమెంట్ల నిర్మాణాన్ని ప్రారంభించాయి. అవి అనేక రకాల సమస్యల కారణంగా పుల్ కాలేదు. నిర్మాణాలు పూర్తి అయినా అమ్మకాలు పూర్తి కాలేదు. ఇప్పుడు వాటికి డిమాండ్ పెరుగుతోంది. 70 లక్షల లోపే ధరలు ఉండటంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. హైరేంజ్ సౌకర్యాలు ఉన్న అపార్టుమెంట్లు కావడంతో వేగంగా అమ్మకాల ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇక చిన్న చిన్న బిల్డర్లు.. తాడేపల్లి నుంచి గుంటూరు వరకూ.. నాలుగైదు కిలోమీటర్ల రేడియస్.. రోడ్డు సౌకర్యం ఉన్న గ్రామాల్లో కూడా అపార్టుమెంట్లు నిర్మించారు. ఇప్పుడు అవి యాభై లక్షలకు కూడా లభిస్తున్నాయి. కొన్ని చోట్ల 35 నుంచి 40 లక్షలకూ అపార్టుమెంట్లు వస్తున్నాయి.
అమరావతిలో ఇల్లు లేదా ఫ్లాట్ .. స్థలం కొనాలి అనుకునేవారికి ఇప్పుడు మంచి సమయం అని చెబుతున్నారు. ప్రభుత్వం ఈ నెలలో నిర్మాణ పనులు ప్రారంభిస్తుంది. ప్రైవేటుకంపెనీలు కూడా తమ కార్యాలయాల నిర్మాణాలను ప్రారంభించబోతున్నాయి. దీంతో అక్కడ సందడి పెరనుంది. జనాభా పెరగనుంది. ఈ సమయంలోనే వెసులుబాటు ఉన్న వారు అక్కడ ఓ స్థలం లేదా ఫ్లాట్ కొనుక్కోవడం లాభదాయకమని రియల్ ఎస్టేట్ వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.