గుంటూరు జిల్లా చుండూరులో ఎస్ఐగా పని చేసే మహిళా ఎస్ఐ శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. చివరి నిమిషంలో గుర్తించి ఉన్నతాధికారులు ఆస్పత్రికి తరలించినా ఫలితం కనిపించలేదు. కుటుంబ గొడవలు ఉన్నా.. పట్టుదలతో చదివి ఎస్ఐగా ఎంపికైన మహిళ.. ఇలా ఆత్మహత్య చేసుకోవడం పోలీసు వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. ఆమె ఇచ్చిన మరణ వాంగ్మూలం ప్రకారం.. ఓ సీఐని వీఆర్‌కి పంపారు. ఆయన వేధించాడని ఆమె చెప్పింది. కానీ అంతకు మించిన వ్యవహారాలు.. పోలీసుల మధ్య జరిగాయన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన శ్రావణి.. 2018లో ఎస్ఐగా ఎంపికయ్యారు. మొదట నర్సరావుపేటలోని దిశ పోలీస్ స్టేషన్లో పని చేశారు. అక్కడ నుండి చుండూరు పోలీస్ స్టేషన్‌కు ఎస్ఐగా వచ్చారు. అయితే… ఆమె భర్తతో విడాకులు తీసుకున్నారో లేక విబేధాలొచ్చి విడిగా ఉంటున్నారో తెలియదు కానీ… కుటుంబంతో మాత్రం ఉండటం లేదు. చుండూరు పోలీస్ స్టేషన్లోనే రవీంద్ర ఆనే కానిస్టేబుల్‌తో ఆమె సన్నిహితంగా ఉండటం ప్రారంభించారు. అయితే ఆ రవీంద్రకు ఇంతకు ముందే పెళ్లయింది. ఆయనపై చాలా అభియోగాలున్నాయి. ఓవాలంటీర్ను కూడా ప్రేమ పేరుతో మోసం చేసినట్లుగా ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అయితే ఎస్ఐ, కానిస్టేబుల్… అందరికీ తెలిసేలానే.. సహజీవనం చేస్తూండటంతో… పెద్ద వివాదం అయిపోయింది. దాంతో కానిస్టేబుల్ రవీంద్రను వీఆర్‌కు పంపించారు.
తర్వాత కూడా వీరిద్దరిని ఉన్నతాధికారులు హెచ్చరించారు. పద్దతి మార్చుకోవాలని సూచించారు. అయితే.. ఇద్దరూ మారలేదు. తమను విడదీస్తున్నారంటూ.. తెనాలి సమీపంలో వీరిద్దరూ కలిసి పురుగు మందు సేవించారు. ఆత్మహత్యాయత్నం చేసుకున్న వీరిద్దరిని గుంటూరులోని వేరు వేరు ఆసుపత్రులకు తరలించారు. శ్రావణి చనిపోగా.. రవీంద్ర చికిత్స పొందుతున్నాడు. పోలీసుల శాఖ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కావడంతో అంతర్గతంగా విచారణ జరుపుతున్నారు.
పోలీసు ఉద్యోగాలకు ఎంపిక చేసేటప్పుడు.. ఎలాంటి ప్రామాణికతను పాటిస్తారో కానీ.. కనీస నైతిక విలువలు లేని వారు… కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఉద్యోగాలకు ఎంపికవుతున్నారు. వారే నైతికత లేకుండా ప్రవర్తిస్తూ తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారు. ఫలితంగా సమాజంపై దుష్ప్రభావం పడుతోంది.