మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సాంకేతికంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కానీ పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే భావనతో చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆనం వివేకా మరణం తర్వాత.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లు … తనను కలసిన వారందరికీ చెప్పారు. మీడియాతో నేరుగా చెప్పకపోయినా… తనకు గౌరవం దక్కని చోట ఉండలేనని పరోక్షంగా పార్టీ మారబోతున్నట్లు ప్రకటించారు. ఆయన వైసీపీలో చేరడానికి చర్చలన్నీ పూర్తయ్యాయని… ఇక చేరడమే మిగిలిందని… ఆయన అనుచరవర్గం కూడా ప్రచారం చేసింది. దీన్ని వైసీపీ వర్గాలు కూడా ధృవీకరించాయి.
కానీ ఆనం రామనారాయణ రెడ్డి చేరిక మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. వైఎస్ఆర్ జయంతి రోజున..చేరుతారన్న ప్రచారం కొద్ది రోజులుగా నెల్లూరులో జరిగింది. కానీ అది కూడా జరగలేదు. దాంతో.. వర్గీయుల్లో ఏం జరుగుతోందన్న ఉత్సుకత ఆనం వర్గీయుల్లో ఏర్పడింది. ఆనం రామనారాయణరెడ్డి బయటకు చెప్పకపోయినా… వైఎస్ జగన్ అసెంబ్లీ టిక్కెట్ల విషయంలో ఎలాంటి హమీ ఇవ్వలేదని.. కచ్చితమైన హామీ కోసం.. ఎదురు చూస్తున్నారని అంటున్నారు. ఆనం నియోజకవర్గం.. ఆత్మకూరు. అక్కడ ప్రస్తుతం మేకపాటి కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. దానికి మేకపాటి అంగీకరిస్తారా లేదా అన్నది ముఖ్యం. అలాగే పార్టీలో చేరితే ఆనం వివేకా కుమారునికి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించాలి. లేకపోతే.. కుటుంబంలో విబేధాలు వస్తాయి. అందుకే రెండు టిక్కెట్ల విషయంలో స్పష్టమైన హామీ ఇస్తే పార్టీలో చేరేందుకు ఆనం రామనారాయణరెడ్డి రెడీ అయ్యారు. కానీ జగన్ మాత్రం ముందు పార్టీలో చేరండి.. తర్వాత టిక్కెట్ల గురించి మాట్లాడుకుందామని చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఆనం రామనారాయణరెడ్డి.. ఉద్దేశపూర్వకంగా. .. టీడీపీని దూరం చేసుకునేలా ప్రకటనలు చేయడంతో.. ఆయనకు వైసీపీ తప్ప మరో ఆప్షన్ లేదని..జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డిని .. టిక్కెట్ హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నా.. ఆనం విషయంలో మాత్రం టిక్కెట్ల హామీ ఇవ్వడం లేదంటున్నారు. ఈ విషయంలో ఆనం వర్గీయులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. పార్టీ మారుతానని సూచనలు పంపిన తర్వాత తెలుగుదేశం పార్టీ హైకమాండ్.. చాలా మందిని రాజీ చర్చలకు పంపింది. కానీ ఆనం మాత్రం మెత్తబడలేదు. తాజాగా కిరణ్ కుమార్ రెడ్డితో పాటు.. కాంగ్రెస్‌లోకి వెళ్తారన్న ప్రచారాన్ని కూడా ఆయన వర్గీయులు ప్రారంభించారు. ఇలా అయినా.. జగన్‌పై ఒత్తిడి పెంచాలన్న వ్యూహం కావొచ్చు. మొత్తానికి ఆనం.. ఉన్న పార్టీని దూరం చేసుకుని.. కొత్త పార్టీలో మనస్ఫూర్తిగా చేరలేక.. క్రాస్‌రోడ్డులో ఉన్నారని చెప్పుకోవచ్చు..!