రెండు రోజుల క్రితం దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే అమరావతి వచ్చి మరీ ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. శాలువా కప్పి.. ఓ జ్ఞాపిక కూడా అందించారు. అందరూ కుంబ్లే రాకపై రకరకాల ఊహాగానాలు చేశారు. ఏపీలో స్పోర్ట్స్ యూనివర్శిటీకి సహకారం అందిస్తామని చెప్పారని.. క్రీడా పరికరాల ఫ్యాక్టరీ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నారని ప్రభుత్వ పబ్లిక్ రిలేషన్ వర్గాలు .. మీడియాకు సమాచారం ఇచ్చాయి. కానీ అసలు విషయం.. ఆయన .. ఏపీ ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండటంతో వాటి కోసం నేరుగా జగన్ను కలిసేందుకు వచ్చారని చెబుతున్నారు.
అనిల్ కుంబ్లే క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత క్రీడా సేవల సంస్థ టెన్విక్ను ప్రారంభించారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి కొన్ని క్రీడా సంబంధిత కార్యక్రమాలు చేపట్టింది. చంద్రబాబు హయాంలో టెన్విక్ సంస్థ ఏపీ సర్కార్కు పలు సేవలు అందించింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంత క్రీడాకారులను గుర్తించడం కోసం ప్రాజెక్ట్ గాండీవను ప్రారంభించారు. ఇలాంటి సేవలను టెన్ విక్ సంస్థ అందించింది. ఏపీలో చేపట్టిన కార్యక్రమాల గురించి.. టెన్విక్ సంస్థ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకుంది. అయితే.. అదంతా చంద్రబాబు సీఎంగాఉన్నప్పుడే. జగన్ సీఎం అయిన తర్వాత ఆ ప్రాజెక్టులన్నీ మూలనపడ్డాయి. కనీసం పెండింగ్ బిల్లులు కూడా.. టెన్ విక్ సంస్థకు చెల్లించలేదు.
నెలలు గడిచిపోతున్నా.. తన సంస్థకు రావాల్సిన బిల్లుల గురించి ఠికానా లేకపోవడం.. బిల్లుల కోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాలన్న సూచనలు అందడంతో ఆయన రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ అపాయింట్మెంట్ తీసుకుని ఆయనకు తన సంస్థ బిల్లుల గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వంలో ఎక్కువగా ప్రాజెక్టులు చేశారు కాబట్టి… బిల్లులు ఇవ్వడం కష్టమే. అప్పట్లో బిల్లులు రాని వాళ్లంతా కోర్టులకు వెళ్తున్నారు. కానీ కుంబ్లే కోర్టుకు వెళ్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. వచ్చి మరీ రిక్వెస్ట్ చేశారు కాబట్టి.. ఆయనకు ఇవ్వాల్సిన బిల్లులయిన చెల్లిస్తారో లేదోనన్న చర్చ నడుస్తోంది. మొత్తానికి ఊరకరారు మహానుభావులు అని.. ఊరకనే అనుకోరు. బలమైన కారణం ఉండే ఉంటుంది. ఏపీలో ఆ బలమైన కారణం.. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన నిధులను విడుదల చేయించుకోవడం.