దక్షిణాదిలో ఒకట్రెండు భారీ విజయాలు సాధిస్తే చాలు.. అందరి చూపూ బాలీవుడ్ వైపే ఉంటుంది. అక్కడ ఓ సినిమా చేసి, అంతర్జాతీయంగా పాపులర్ అయిపోవాలని చూస్తుంటారు. అయితే అనుష్క మాత్రం ఎందుకనో బాలీవుడ్ అంటే ఆసక్తి చూపించడం లేదు. దక్షిణాదిన పదేళ్లకు పైగా అనుభవం ఉన్నా, స్టార్ కథానాయిగా పేరు తెచ్చుకొన్నా.. బాలీవుడ్ అంటే నొసలు చిట్లిస్తోంది. `బాలీవుడ్ వెళ్తేనే కథానాయికకు గుర్తింపా` అని ఎదురు ప్రశ్నిస్తోంది. బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ కథానాయికగా పిలిపించుకోవాలని ఎప్పుడూ అనుకోలేదని, తానెప్పుడూ హిందీ సినిమాల కోసం ప్రాకులాడలేదని చెబుతోంది స్వీటీ.
దక్షిణాదిన నా అవకాశాలు నాకొస్తున్నాయి.. ఈ దశలో బాలీవుడ్ వెళ్లి ఓ కొత్తమ్మాయిలా అవకాశాల్ని వెదుక్కోలేను.. అక్కడ కొత్తగా నిరూపించుకోలేను… అన్నది అనుష్క పాయింట్. అయితే అనుష్కకి బాలీవుడ్ అంటే ఇంత కోపం ఉండడానికి వేరే కారణాలున్నాయట. అనుష్క కెరీర్ మొదలెట్టిన కొత్తలో ఓ బాలీవుడ్ సినిమా చేయాలని తెగ ప్రయత్నించిందని, అయితే అప్పట్లో అనుష్కని ఎవ్వరూ పట్టించుకోలేదని, అప్పటి అవమానాన్ని అనుష్క తట్టుకోలేకపోయిందని అందుకే ఇప్పుడు బాలీవుడ్ సినిమా అంటే నో చెబుతోందని తెలుస్తోంది. మరి నిజానిజాలేమిటో జేజమ్మకే తెలియాలి.