విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన జగన్పై దాడి ఘటనకు సంబంధించి… జాతీయ దర్యాప్తు సంస్థల ప్రమేయం అవసరం లేదని.. విశాఖ సీపీ మహేష్ చంద్ర లడ్హా అన్నారు. ఈ ఘటనలో జాతీయ భద్రతా పరమైన అంశాలు ఉంటేనే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందన్నారు. జగన్పై దాడి గటనకు సంబంధించిన వివరాలను లడ్హా వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డిని హత్య చేయాలన్న ఆలోచన.. దాడి చేసిన శ్రీనివసరావుకు లేదని స్పష్టం చేశారు. జగన్కు ఏమీ జరగకుండా… దాడి చేసే ముందుగా.. చాలా ప్రిపరేషన్లు చేసుకున్నారని.. రెండు సార్లు … స్టెరిలైట్.. అంటే ఉడకబెట్టారని చెప్పుకొచ్చారు. కేసులో ఇప్పటి వరకు మొత్తం 92 మందిని విచారించామని … ఈ విచారణలో మొత్తం వ్యవహారం బయటపడిందన్నారు.
దాడికి ఉపయోగించిన కోడిపందేల కత్తికి నిందితుడు రెండుసార్లు పదును పెట్టాడని సీపీ తెలిపారు. ముందుగానే ఓ లేఖను రాయించుకున్నాడు. హేమలత, షేక్ అమ్మాజీ అనే మహిళలకు శ్రీనివాస్ ముందురోజు ఫోన్ చేసి తన పేరు టీవీలో చూస్తారంటూ చెప్పాడు. అక్టోబర్ 25న ఉదయం 4.55 గంటలకు ఎయిర్పోర్టుకు బయలు దేరాడు. ఎయిర్పోర్టు క్యాంటీన్లో ఉదయం 9 గంటలకు కత్తికి మరోసారి పదును పెట్టాడు. కరణం ధర్మశ్రీతో జగన్ మాట్లాడుతుండగా శ్రీనివాస్ దాడికి తెగబడ్డాడు సీపీ తెలిపారు. మొదట అక్టోబర్ 18న జగన్పై శ్రీనివాసరావు దాడికి ప్లాన్ చేశాడు. కానీ జగన్ 17వ తేదీన హైదరాబాద్ వెళ్లిపోవడంతో ఊరుకున్నాడు., మళ్లీ అక్టోబర్ 25న పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశాడు.శ్రీనివాస్ నుంచి 2 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ లడ్హా ప్రకటించారు. జగన్ చొక్కా, కత్తి, ల్యాబ్ రిపోర్ట్లు అందాయని, శ్రీనివాసరావు హ్యాండ్ రైటింగ్ రిపోర్టులు అందాయన్నారు. శ్రీనివాస్ గతంలో వెల్డర్, కేక్ మాస్టర్, కుక్గా పనిచేశాడు. జనవరి 2018 కర్ణాటకలో తనతో పనిచేసిన వెంకటపతి అనే వ్యక్తి ద్వారా ఫ్యూజన్ ఫుడ్స్ లో చేరాడని పోలీసులు చెబుతున్నారు.
మరో వైపు వైసీపీ మాత్రం… విశాఖ పోలీసుల వాదనను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. జాతీయ భద్రతా సంస్థలతో దర్యాప్తు చేయించాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే.. ఈ కేసు తెలంగాణ హైకోర్టులో ఉంది. దీనిపై… కేంద్రం పూర్తి వివరాలు అందించడం లేదని.. గతంలో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తరుణంలోనే… పోలీసులు ప్రకటించిన వివరాలతో… మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.