‘పరిపాలన సౌలభ్యం’… మనం తరచుగా వినేమాట. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్న ఉద్దేశంతోనే వివిధ మంత్రిత్వ శాఖలు ఉంటాయి. అధికార పార్టీ ప్రతినిధులు ఆయా శాఖలకు మంత్రులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే, మంత్రి వర్గ విస్తరణ, మార్పులూ చేర్పులూ అనేవి ఎప్పుడు ఉండాలి..? ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలన్నప్పుడే కదా! పరిపాలనా సౌలభ్యం కోసమే క్యాబినెట్ లో మార్పులు జరగాలి. కానీ, ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ అనే కార్యక్రమం అధికార పార్టీని మరింత బలోపేతం చేసుకునేందుకు దొరికిన అవకాశంగా మారిపోయింది! త్వరలోనే కేంద్ర క్యాబినెట్ విస్తరణకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమౌతున్నారు. కీలకమైన శాఖల్లో మార్పులు ఉంటాయనీ, కొత్త మిత్రులకు అవకాశాలు దక్కుతాయని ప్రచారం సాగుతోంది. దాదాపు 24 మంది మంత్రులపై ఈ విస్తరణ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం.
ఈ విస్తరణలో అన్నాడీఎంకే, జేడీయూ, ఎన్సీపీలకు బెర్తులు దక్కుతాయని అంచనా. మహారాష్ట్రలోని శివసేనతో దోస్తీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీకి అవకాశం దక్కొచ్చు. కనీసం పది కొత్త ముఖాలు క్యాబినెట్ లోకి రాబోతున్నట్టు వినిపిస్తోంది. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి కావడంతో ఆ శాఖకు ఓ మంత్రి అవసరం. రక్షణ శాఖ బాధ్యతల్ని అరుణ్ జైట్లీ తాత్కాలికంగా చూస్తున్నారు. ఆయనకు ఆర్థిక శాఖ వ్యవహారాలంటేనే ఇష్టం. దాంతో రక్షణ శాఖకు కొత్త మంత్రి వచ్చే అవకాశాలున్నాయి. ఇక, ఉన్నవారిలో మార్పులు ఎవరికంటే… రైల్వే శాఖమంత్రి సురేష్ ప్రభు ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే, అది ఇంకా వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. ఆయన్ని తప్పించబోతున్నట్టు చెబుతున్నారు. ఏపీకి చెందిన అశోక్ గజపతి రాజు శాఖలో కూడా మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.
రిలీవ్ కాబోతున్న మంత్రులు ఎవరంటే, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిని తప్పించడం ఎందుకంటే… వీరి సేవలకు పార్టీకి అవసరమట. అందుకే, వీరిని తమకు అప్పగించాలని భాజపా అధ్యక్షుడు అమిత్ షా కోరారనీ, అందుకే వారిని బాధ్యతల నుంచి తప్పిస్తున్నారని సమాచారం. నిర్మలా సీతారామన్ కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించాలని అమిత్ షా భావిస్తున్నారట. ఇక, జేపీ నడ్డాను హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతారట. ఒడిశాలో నవీన్ పట్నాయన్ కు ఎదుర్కొనేందుకు ధర్మేంద్ర ప్రధాన్ సేవలు అవసరమని పార్టీ అభిప్రాయపడినట్టు సమాచారం.
అంటే, త్వరలో జరుగుతున్న కేంద్ర క్యాబినెట్ మార్పులూ చేర్పులకు గల కారణమేంటయ్యా అంటే… భారతీయ జనతా పార్టీ సౌలభ్యం కోసమే అని చెప్పాలి. వచ్చే లోక్ సభ ఎన్నికలతోపాటు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా దృష్టిపెట్టుకుని కొత్త మిత్రులకు చోటు కల్పిస్తున్నారు. ఇక, పార్టీ బాధ్యతల పేరుతో ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్న మంత్రులను కూడా తప్పిస్తున్నారు. ఈ క్రమంలో పరిపాలన సౌలభ్యం, ప్రజా అవసరాలు, శాఖల పనితీరు వంటి కొలమానాలేవీ లేవు. ఉన్నదొక్కటే కొలమానం… భారతీయ జనతా పార్టీ వెలిగిపోవాలి, అంతే! దాని కోసం మంత్రుల్నైనా మార్చేస్తారా, మిత్రుల పేరుతో ఏపార్టీల వారికైనా పదవులు కట్టబెట్టేస్తారు.ఇప్పుడు జరుగుతున్నది అదే.