ఆంధ్రప్రదేశ్ లో భాజపాకి ఓట్లెక్కడున్నాయి, సీట్లు ఎక్కడ వస్తాయి, రాష్ట్రంలో భాజపా ఉనికే లేదు అంటూ ఈ మధ్య టీడీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండి చేయి చూపడం, విభజన హామీలను నెరవేర్చకపోవడం, ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీని పట్టించుకోకపోవడం… వెరసి ఇవన్నీ కలిసి ఏపీలో భాజపాపై తీవ్ర వ్యతిరేకత పెంచడానికి కారణమయ్యాయి. ఎంతగా అంటే… ఎన్నికల ముందు భాజపాతో పొత్తు పెట్టుకునేందుకు ఏ పార్టీలూ ముందుకు వచ్చే ధైర్యం చేయలేనంతగా! ఈ విషయం భాజపా పెద్దలకు తెలుసు కాబట్టే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో సొంతంగానే పోటీ చేస్తాం, ఇతర పార్టీలతో పొత్తు ఉండకపోవచ్చనే వాదన ముందే వినిపిస్తున్నారు. అయితే, ఏ వ్యూహమూ లేకుండా సోలోగా పోటీ చేస్తామని భాజపా నేతలు అనరు కదా!
భాజపా నేత, ఎంపీ కంభంపాటి హరిబాబు మీడియాతో మాట్లాడుతూ… ఎన్డీయే నుంచి టీడీపీ బయటకి వెళ్లిన తరువాత, ఆంధ్రాలో భాజపా సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుందన్నారు. గడచిన మూడున్నర సంవత్సరాలుగా ఏయే రంగాల్లో కేంద్రం ఏ రకమైన సహాయం చేసిందనే విషయాన్ని ప్రజల ముందు ఉంచుతామన్నారు. రాబోయే ఏడాది కాలంలో… విభజన చట్టంలో ఇంకా పూర్తి చేయాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీకి నూటికి నూరు శాతం సాయం అందించామనే సందేశంతోనే తాము ప్రజల్లోకి వెళ్తామని హరిబాబు చెప్పారు. తద్వారా మంచి ఫలితాలను సాధిస్తామన్నారు.
ప్రస్తుతం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నా… ఏపీపై భాజపా ధీమా ఇదేనేమో! వచ్చే ఏడాది కాలంలో విభజన చట్టంలోని కొన్ని అంశాలను పూర్తి చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే, ఆ క్రెడిట్ టీడీపీ చేస్తున్న పోరాటానికో, వైకాపా చేస్తున్న అలుపెరుగని సమరానికో ప్రతిఫలంగా దక్కిందనే ఎవరికివారు ప్రచారం చేసుకునే అవకాశం ఇవ్వరన్నమాట! విభజన చట్టంలోని అంశాలు, ఏపీకి ఇచ్చిన హామీలను భాజపా తప్ప, ఇంకెవ్వరూ నెరవేర్చలేరనే ప్రచారం చేసుకునే వ్యూహంలో ఉన్నట్టు కనిపిస్తోంది. కొన్ని పనులు చేసి… వాటితో ఏపీలో ప్రచారానికి వెళ్లాలని భావిస్తున్నట్టున్నారు.