లోక్ సభలో ఏం జరిగిందో.. రాజ్యసభలో కూడా అదే జరిగింది. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆంధ్రా గురించి చివరిగా ఇంకేదైనా కొత్త మాట చెబుతారేమో అని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం కోసం ఎదురుచూసిన మాట వాస్తవమే. అద్భుతాలు జరగవని తెలుసు. కానీ, దిద్దుబాటు చర్య ఉండదా అనే ఒక చిన్న ఆశ మాత్రమే. కానీ, రాజ్యసభలో ఆంధ్రా విషయమై అరుణ్ జైట్లీ మరోసారి ప్రస్థావించి.. కేవలం మొక్కుబడి కామెంట్లతో మమ అనిపించేసుకున్నారు.
రాష్ట్ర విభజనతో ఆంధ్రా ఆదాయం కోల్పోయిందని మొసలి కన్నీరు కార్చారు. విభజన సమయంలో ఆంధ్రాకి న్యాయం జరగాలని తాము పోరాటం చేశామని జబ్బలు చరుచుకున్నారు! పోలవరానికీ రాజధాని అమరావతి నిర్మాణానికీ నిధులిచ్చామని మరోసారి చాటింపేశారు. రైల్వే జోన్, విశాఖ చెన్నై కారిడార్, స్టీల్ ప్లాంటు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించినట్టు ఘనంగా చెప్పారు! కేంద్ర సాయం విషయమై వివిధ శాఖలతో చర్చలు జరుపుతున్నామని మరోసారి చెప్పారు. ఇంతే.. ఆంధ్రా గురించి ఆయన మాట్లాడింది ఇంతే. అయితే, ఇంతకంటే గొప్పగా ఉంటుందని ఎవ్వరూ ఆశించలేదు. ఆర్థికమంత్రి కావొచ్చు, రైల్వే మంత్రి కావొచ్చు… కీలకమైన శాఖల్లో మంత్రులెవరైనా సరే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుమతి లేనిదే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోరు అనేది అందరికీ తెలిసిన విషయమే. పీఎంవో నుంచి ఆదేశాలు లేకపోతే ఏ శాఖలోనూ ఫైళ్లు కదలవనేది ఓపెన్ సీక్రెట్. కాబట్టి, ఆర్థికమంత్రి తీరులో అనూహ్య మార్పులు ఎలా ఉంటాయి..?
ఆంధ్రా విషయంలో మోడీ ముందే ఓ నిర్ణయం తీసేసుకున్నట్టున్నారు! వాళ్లెంత అరిచి మొత్తుకున్నా స్పందించొద్దనే ఆ నిర్ణయం. మొండిగా వ్యవహరిస్తాం అని భీష్మించుకున్నారు. ఆంధ్రా అంశాలపై స్పందించాలని ఇతర పక్షాలు కోరినా, అకాలీదళ్ వంటి పార్టీలు అడిగినా, పొరుగు రాష్ట్రాలు కూడా సరే అని అంటున్నా… కేంద్రం స్పందించదు, ఆంధ్రాకి అదనంగా ఏమీ విదల్చదు అనేది నేటితో పరిపూర్ణంగా రూఢి అయిపోయింది. ఇది మోడీ సర్కారు మొండితనానికి పరాకాష్ట. ఈ విషయంలో ఇతర అభిప్రాయలూ సీనియర్ల సూచనలు వర్కౌట్ కావనేది అర్థమౌతూనే ఉంది. అంతెందుకు… ఏపీ విషయమై సీనియర్ నేత ఎల్ కే అద్వానీ స్పందించిన తీరు మోడీ మొండితనానికి అద్దం పడుతోంది. ఆంధ్రా విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో తనకీ అర్థం కావడం లేదన్నట్టు అద్వానీ మాట్లాడారు! సో.. ఏపీ విషయమై మోడీ సర్కారు తీరు చాలాచాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రాకి ఇంతే అని ఆయన డిసైడ్ చేసి ఫారిన్ టూర్ కి వెళ్లిపోయారు! ఆయన వచ్చేలోగా నిర్ణయాలు మారతాయా..?