ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. బూటకపు ఎన్ కౌంటర్ చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంతకుఇంతా అనుభవిస్తారంటూ మావోయిస్టులు హెచ్చరించారు. మానవ బాంబుతో ఆయనపై దాడి చేస్తామనీ, పోలీసులూ సైనిక బలగాలు కూడా ఈ దాడిని ఆపలేవంటూ ప్రకటన చేశారు. అన్నంలో విషయం కలిపి, మావోయిస్టులను ఏమార్చి హతమార్చాలంటూ ఆరోపించారు. దీంతో ముఖ్యమంత్రితోపాటు ఆయన కుటుంబ సభ్యుల భద్రతపై కూడా అప్రమత్తం అయ్యింది ప్రభుత్వం.ఇంకోపక్క… ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల బంద్‌కి మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మల్కన్ గిరి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు మరణించారు. వారిలో పలువురు కీలక సభ్యులు కూడా ఉన్నట్టు భావిస్తున్నారు! ఈ ఎన్ కౌంటర్‌కు నిరసనగా నవంబర్ 3వ తేదీన బంద్ నిర్వహిస్తున్నట్టు మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్‌కు కారణం కోవర్టు ఆపరేషన్ కారణమని పేర్కొంది.
బంద్ పిలుపు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత కూడా పెరిగింది. సీఎం చుట్టూ ఉండే కమాండోల సంఖ్యను పెంచారు. అలాగే, ముఖ్యమంత్రి జిల్లా పర్యటనల్ని కూడా తాత్కాలికంగా రద్దు చేశారు.బహిరంగ సభలూ సమవేశాలకు కూడా కొన్నాళ్లు బ్రేక్ పడ్డట్టే.విజయవాడలోని చంద్రబాబు నివాసంతోపాటు, ముఖ్యమంత్రి కార్యాలయానికి భద్రతను మరింత పెంచారు. ఎక్కడిక్కడ నిఘా ఏర్పాటు చేశారు.ముఖ్యమంత్రిని కలవడానికి వస్తున్నవారిపై కూడా గట్టి నిఘా పెట్టించారు. సామాన్య ప్రజలకు అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు!దీంతోపాటు సీఎం ఫ్యామిలీకి కూడా భద్రతగా బందోబస్త్ పెంచారు. నారాలోకేష్ కూడా పర్యటనల్ని తగ్గించుకున్నట్టు తెలుస్తోంది.
మొత్తానికి ఎన్ కౌంటర్ ఎఫెక్ట్ చంద్రబాబు మీద బాగానే పడుతోంది. మూడో తేదీన మావోయిస్టుల బంద్ నేపథ్యంలో నిఘా వర్గాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడితోపాటు పలువురు కీలక మావోయిస్టు నేతల జాడ ఇంకా తెలియాల్సి ఉంది. తాజా ఎన్ కౌంటర్ మావోయిస్టుల భారీ నష్టాన్ని చేకూర్చిందనే చెప్పాలి. కాబట్టి, ప్రతీకార చర్యలు ఉండే అవకాశం ఉందన్న అనుమానంతోనే అనుక్షణం అప్రమత్తంగా ఉంటోంది సర్కారు.