చిరంజీవి 150వ చిత్రం కత్తి ఇటీవలే కొబ్బరికాయ్కొట్టుకొంది. మేలో ఈ సినిమా పట్టాలెక్కించేస్తా… అని చరణ్ చెప్పాడు. అయితే అలాంటి సంకేతాలేం కనిపించడం లేదు. కనీసం కథానాయిక పేరు కూడా ఖరారు కాలేదు. సినిమా షూటింగ్ ఇప్పట్లో లేదని జులైకి వాయిదా పడిందన్నది ఓ లెటెస్ట్ న్యూస్. చిరంజీవి స్లిమ్ అవ్వడానికి కొంత టైమ్ పడుతుందని, అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతోందని చిత్రబృందం చెబుతోంది. అయితే.. అసలు కారణం వేరే ఉంది. కత్తి సినిమా కథకు సంబంధించిన ఓ వివాదం నడుస్తోంది. గత రెండు నెలల నుంచి.. ఈ వివాదం అటు రైటర్స్ అసోసియేషన్‌లో, ఇటు ఫిల్మ్‌ఛాంబర్‌లో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు గిర్రు గిర్రున తిరుగుతోంది. ”నాకు న్యాయం జరిగేంత వరకూ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనివ్వను” అని సదరు రచయిత ఖరాఖండిగా చెప్పేస్తున్నాడు.
ఆ రచయితకు ఫెడరేషన్ కూడా మద్దతు తెలిపింది. నష్టపరిహారం ఇవ్వకపోతే.. చిరంజీవి సినిమాకి సహాయ నిరాకరణ చేస్తాం అని హెచ్చరించింది. అయితే నష్టపరిహారం ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నది చిరంజీవికి సంబంధించిన విషయం కాదు. అది మురుగదాస్‌తో తేల్చుకోవాల్సిన వ్యవహారం. అందుకే చిరంజీవి కామ్‌గా ఉంటున్నాడట. ఒకవేళ రంగంలోకి దిగితే.. ఆ నష్టపరిహారం ఏదో తాను చెల్లించాల్సివస్తుందని చిరంజీవి భయం. అది తేలిన తరవాతే.. షూటింగ్ మొదలుపెట్టొచ్చు కదా అని చిరు ఎదురుచూస్తున్నాడు. ఈ వ్యవహారం తేలేదెప్పుడు, సినిమా మొదలయ్యేది ఎప్పుడు?