మా టీవీకి ఏళ్ల తరబడి వెన్నుదన్నుగా నిలిచిన కార్యక్రమం… మీలో ఎవరు కోటీశ్వరుడు. మా టీవీ చరిత్రలోనే అత్యధిక టీఆర్పీ రేటింగులు అందిస్తూ టాప్ రియాలిటీ షోగా సాగింది. కోటీశ్వరుడు దెబ్బకు… మిగిలిన టీవీల్లో రియాలిటీ షోలన్నీ టీఆర్పీ రేటింగులు లేక వెలవెలబోయాయి. కొత్త సీజన్లో నాగార్జున స్థానంలో చిరంజీవి కనిపిస్తాడని తెలియగానే… ఇక ఈ రేటింగులకు మరింతగా రెక్కలు రావడం ఖాయమనుకొన్నారంతా. చిరుకి మాస్లో తిరుగులేని ఫాలోయింగ్ ఉంది. చిరు.. రీ ఎంట్రీతో అది మరోసారి రుజువైంది. 150వ సినిమా ఖైదీ నెం.150 సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఎమ్ ఈ కే షోనీ అదే రేంజ్లో హిట్ చేస్తారని ఆశించారంతా. చిరు తొలి షో కూడా అట్టహాసంగా ప్రారంభమైంది. తీరా చూస్తే… రేటింగులు మాత్రం అంత ఆశాజనకంగా లేవు. 5.8 రేటింగుతో ఓ మామూలు షో… గా మిగిలిపోయింది. బుల్లి తెరపై చిరు స్టామినా ఇంతేనా??? చిరు లాంటి స్టార్ వచ్చినా.. బుల్లి తెర ప్రేక్షకులు పట్టించుకోరా? అనే కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇది వ్యక్తిగతంగా చిరు ఓటమే.. అని తేల్చేస్తున్నారు విశ్లేషకులు.
నాగార్జున షోని నడిపించిన విధానం బుల్లి తెర వీక్షకుల్ని ఆకట్టుకొంది. నాగ్ కోసమే ఈ షో చూసినవాళ్లెంతమందో?? నిజానికి కౌన్ బనేగా కరోడ్‌పతి షో… స్థానిక భాషల్లో హిట్ కాలేదు. అమితాబ్ బచ్చన్ నడిపించినంతగా ఏ స్టార్ ఈ షోని రక్తికట్టించలేకపోయాడు. ఒక్క నాగార్జున తప్ప! చిరు వచ్చాక… ఈ రేటింగులు మరింత పెరిగాలి. ఎందుకంటే నాగ్‌తో పోలిస్తే.. చిరు ఇంకా పెద్ద స్టార్. చిరు ఫాలోయింగ్ కూడా నాగ్‌తో పోలిస్తే పదింతలు ఎక్కువగా ఉంటుంది. అలాంటిది నాగ్ తెచ్చుకొన్న రేటింగులు చిరు ఎందుకు తెచ్చుకోలేకపోయాడన్నది ఆసక్తిగా మారింది. చిరు మాట కారి కాదు. జనాలతో మింగిల్ అవ్వలేడు. చిరునవ్వు కూడా కృత్రిమంగానే ఉంటుంది. దానికి తోడు… ప్రశ్నకీ ప్రశ్నకీ మధ్య ఆడియన్స్‌తో ఇంట్రాక్ట్ అవ్వడం చిరుకి చేత కావడం లేదు. ఎమోషనల్‌గా ఈ గేమ్‌ని నడిపించలేకపోతున్నాడు. డ్రామాని రక్తికట్టించలేకపోతున్నాడు.. ఇలా రకరకాల కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు. అన్నింటికీ మించి.. చిరు మాస్ హీరో! మాస్ లో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆ మాస్… ఈ షోకి దూరమయ్యారన్న వాదనా ఉంది. అందుకే.. మీలో ఎవరు కోటీశ్వరుడు చప్పగా సాగుతోందని, రేటింగులు ఉండడం లేదని తేల్చేశారు. అయితే.. నాగ్ కూడా తొలి రోజుల్లో ఇలానే తడబడ్డాడు.. పోను పోను.. సెటిల్ అయ్యాడు. చిరుదీ అదే పరిస్థితని, అలవాటు పడ్డానికి టైమ్ పడుతుందని, చిరు గెలిచాడా, లేదా? అనే విషయం తేలాలంటే మరో రెండు మూడు వారాలు గడవాలని విశ్లేషకుల మాట. మున్ముందు ఈ షో రేటింగులు ఎలా ఉంటాయో…. చిరు పుంజుకొంటాడో లేదో వెయిట్ అండ్ సీ..!?