ఒక జిల్లా కలెక్టర్ బదిలీ… చాలా రొటీన్ వ్యవహారం. అత్యంత సహజంగా జరిగే ప్రక్రియ. దాని గురించి మీడియాలో చర్చలెందుకుంటాయి, రాజకీయ వర్గాల్లో గుసగుసలు ఎందుకుంటాయి? తాజాగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బదిలీ అయ్యారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. వరుసగా మూడేళ్లు ఒకేచోట పనిచేసిన అధికారులను బదిలీ చేయడం రొటీన్! ఆరకంగానే ఈయన బదిలీ అయిందని అనుకోవచ్చు. కానీ, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అలా లేదు! ఇది సాధారణంగా జరిగింది కాదు, దీని వెనక రాజకీయ కారణాలున్నాయనీ, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పట్టుబట్టి మరీ ఆయన్ని బదిలీ చేయించారనే టాక్ వినిపిస్తోంది.
కలెక్టర్ సర్ఫరాజ్ చాలా ముక్కుసూటి మనిషి అని పేరుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల ప్రధాన అధికారిగా ఆయనే ఉన్నారు. ఆ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా గంగుల కమలాకర్, భాజపా నుంచి బండి సంజయ్ పోటీపడ్డారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఆ ఎన్నికల పోరులో గంగుల గెలిచారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బండి సంజయ్ భాజపా ఎంపీగా గెలిచారు. ఆ తరువాత, బండి సంజయ్ పొలిటికల్ గా యాక్టివ్ అవుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో తనని ఓడించిన గంగుల కమలాకర్ మీద ఎలక్షన్లో ఖర్చు విషయమై కొన్ని ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డబ్బుతో ప్రలోభాలకు పాల్పడ్డారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ సంజయ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై విచారణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. దీనికి సంబంధించి జిల్లా నుంచి పూర్తి నివేదికలు కేంద్ర ఎన్నికల సంఘానికి వెళ్లాల్సి ఉంది. అయితే… సరిగ్గా ఈ పనులు ఓ పక్క జరుగుతున్న సమయంలోనే ఎంపీ సంజయ్ కి కలెక్టర్ సర్ఫరాజ్ ఫోన్ చేశారనీ, ఎంపీకి అనుకూలంగా తాను పనిచేస్తానంటూ కలెక్టర్ చెప్పినట్టుగా ఓ ఆడియో టేపు వెలుగులోకి వచ్చింది. ఇది తనను ఇరికించడానికి చేస్తున్న ప్రయత్నమనీ, తన మాటల్ని ఎడిట్ చేసి టేపు తయారు చేశారని కలెక్టర్ అంటున్నారు. దీనిపై సీయస్ కి వివరణ కూడా ఇచ్చారు.
వివాదం ఇక్కడితో సమసిపోతుంది అనుకుంటే.. అనూహ్యంగా ఆయన్ని బదిలీ చేశారు. సర్ఫరాజ్ బదిలీ వెనక మంత్రి గంగుల ఉన్నారనీ, ఆయన పట్టుబట్టి మరీ బదిలీ చేయించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరగుతోంది. గంగుల, బండి సంజయ్ ల మధ్య నెలకొన్న రాజకీయ వైరమే కలెక్టర్ బదిలీకి కారణంగా మారిందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. రాజకీయంగా కక్ష సాధింపులకు సంజయ్ ప్రయత్నిస్తే, దాన్ని గంగుల ఇలా తిప్పికొట్టారనే చర్చ జరుగుతోంది.