ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తేజ తప్పుకున్న సంగతి తెలిసిందే. `ఈ ప్రాజెక్టుకి నేను న్యాయం చేయలేను. అందుకే తప్పుకుంటున్నా` అని తేజ ప్రకటించాడు కూడా. అయితే దీని వెనుక మరిన్ని కారణాలు ఉన్నాయని, అందులో ఓ కారణం ఇప్పటి వరకూ బయటకు రాలేదని తెలుస్తోంది. ఈ సినిమా కోసం తేజ రెమ్యునరేషన్ రూపంలో కొన్ని ఏరియాలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే బాలయ్య మాత్రం తేజకు ఓ రెమ్యునరేషన్ ఫిక్స్ చేసి దానికే కట్టుబడి ఉన్నాడట. `నేనే రాజు నేనే మంత్రి` హిట్ తరవాత తనకు భారీ రెమ్యునరేషన్లు అందుతాయని, ఇంత తక్కువ పారితోషానికి పనిచేయడం ఎందుకని భావించిన తేజ.. ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని టాక్. నిజానికి తేజ ఈసినిమా వద్దు అనుకోవడానికి చాలా కారణాలున్నాయి. అందులో పారితోషికం కూడా ఒకటి.
మరో ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే… ఇందులో వాస్తు దోషాలు కూడా కనిపించాయట. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఆఫీసు ప్రసానన్ నగర్లో ఉంది. ఆ ఆఫీసులో వాస్తు దోషం ఉందని భావించిన బాలయ్య జూబ్లీ హిల్స్ లోని మరో ఇంటకి `ఎన్టీఆర్` ఆఫీసుని మార్చారు. వాస్తు దోషం వల్లే ఇంతకాలం `ఎన్టీఆర్` బయోపిక్‌కి ఆటంకాలు వచ్చాయని బాలయ్య భావిస్తున్నారట. అసలే ఆయనకు సెంటిమెంట్లు జాస్తి. అందుకే.. వాస్తు కోసం ఇప్పుడు ఆఫీసునే మార్చేశారు.