ప్రారంభించకుండానే తెలంగాణ సెక్రటేరియట్లో అగ్నిప్రమాదం జరగడం సంచలనంగా మారింది. అదీ కూడా అర్థరాత్రి పూట జరిగింది. తెల్లవారక ముందే ఆరిపోయింది. పొగ బయటకు వచ్చింది కాబట్టి అందరికీ తెలిసింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ దానిపై ప్రకటన చేయలేదు. కనీసం కేసు పెట్టలేదు. ఎంత నష్టం జరిగిందో చెప్పలేదు. అసలు ప్రమాదం జరిగిందన్న విషయాన్ని కూడా అంంగీకరించడం లేదు. దీంతో అసలేం జరిగిందన్న దానిపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి.
కేసీఆర్ కు ఉన్న నమ్మకాల దృష్ట్యా ఆ అగ్నిప్రమాదం కావాలని చేసిందేనని కొంత మంది చెబుతున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ నిర్మించడానికి అక్కడి బిల్డింగ్లతో పాటు ఆలయాలను కూడా తొలగించారు. అలా తొలగించిన ఆలయాల్లో నల్ల పోచమ్మ గుడి కూడా ఉంది. ఆ గుడి తొలగించినందుకు శాంతి చేసుకునేందుకు అగ్నిప్రమాదం సృష్టించారని అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు.. కానీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఇలాంటి చర్యలు పెరిగిపోతున్నాయి. చాలా మంది ఇలాగే జరిగి ఉండవచ్చని అంటున్నారు.
సెక్రటేరియట్ లో అగ్ని ప్రమాదం జరగడం.. పనుల్లో డొల్లతనాన్ని తెలియజేస్తోంది. నాణ్యత, పర్యవేక్షణ కరువై ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయిని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పనుల్ని పరిశీలించేందుకు తమను అనుమతించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిజంగానే అగ్ని ప్రమాదం జరిగితే.. బయటకు ఎందుకు చెప్పడం లేదు? రహస్యంగా దాచాల్సిన అవసరం ఏముంది? అఖిలపక్షాన్ని ఎందుకు లోపలికి అనుమతించడం లేదు? ఇది కేసీఆర్ గారి గడీనా? ప్రజల కోసం నిర్మించిన సెక్రటేరియట్టా? జనం సొమ్ముతో సెక్రటేరియట్ కట్టి, లోపలికి అనుమతించకపోవడంలో మర్మమేమిటి? అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇలాంటివి కేసీఆర్ పట్టించుకోరు.