కమల్‌హాసన్ – గౌతమి బంధం ఇప్పుడు కాలం మాటున కలిసిపోతోంది. ఇక గౌతమినీ కమల్నీ జంటగాచూళ్లేం. అది సినిమా అయినా… నిజ జీవితమైనా. పదమూడేళ్ల ఈ బంధానికి తెర దించుతూ.. గౌతమి లేఖ ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. మీడియాలో ఇదే హాట్ టాపిక్. ”నేను ఎవ్వరినీ నిందించడం లేదు, సానుభూతి కూడా కోరుకోవడం లేదు” అంటూ తన బ్రేకప్ ని బయటపెట్టింది గౌతమి. అ అక్షరాల మాటున అదిమి పెట్టుకొన్న ఆమె ఆవేదన అర్థం అవుతూనే ఉంది. అయితే.. ఇదేం ఇప్పటికిప్పుడు తీసుకొన్న నిర్ణయం కాదు. మూడు నెలల నుంచీ రగులుతున్న సమస్యే. ఇప్పుడు దానికి పరిష్కార మార్గం దొరికినట్టైంది గౌతమికి. అందుకే ఆలస్యం చేయకూడదన్నట్టుగా, ఇక ఈ భారం మోయలేనన్నట్టుగా తన మనసుని లేఖలో ఆవిష్కరించింది.
కమల్ – గౌతమి ఎందుకు విడిపోయారు? కారణం ఏమిటి? ఇవి ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్నలు.
కాలం, పరిస్థితులు, విధిరాత అంటూ గౌతమి సినిమాటిక్ డైలాగులు చెప్పొచ్చుగాక. కానీ… వీటి వెనుక బలమైన కారణాలున్నాయన్నది తమిళ సినీ వర్గాలు చెబుతున్నమాట. వాళ్లందరి టార్గెట్.. శ్రుతిహాసన్ కావడం విశేషం. గౌతమికీ, శ్రుతికీ మధ్య గొడవలు మొదలైనట్టు ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. శభాష్ నాయుడు సమయంలో అది మరింత పెద్దవి అయినట్టు చెప్పుకొన్నారు. ఆ సినిమాకి గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. గౌతమి డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ వేసుకోను గాక వేసుకోను అంటూ శ్రుతి మొండికేయడంతో ఈ అగ్గి రాజుకొంది. ఆ తరవాత ఈ సినిమా టీమ్ నుంచి.. గౌతమి కూడా తప్పుకొంది. అయితే మా మధ్య ఎలాంటి గొడవలూ, ఈగో సమస్యలూ లేవంటూ గౌతమి క్లారిటీ ఇచ్చింది. ఆ ఉదంతం మర్చిపోయేలోగా.. కుండ బద్దలు కొట్టేసింది గౌతమి.
కమల్ – గౌతమిల వ్యవహార శైలి శ్రుతికి ముందు నుంచీ నచ్చేది కాదు. అందుకే వీళ్లకు దూరంగా ఇండిపెండింట్ ఉమెన్‌గా జీవించేది. అయితే ఈమధ్య కమల్‌తో శ్రుతికి రాపో బాగానే ఉంది. తండ్రీ కూతుర్ల బంధం రోజురోజుకీ బలబడుతోంది. ఈ నేపథ్యంలో గౌతమికీ, కమల్‌కీ మధ్య గీత గీయడం మొదలెట్టిందని, అది.. చివరికి ఈ స్థాయికి చేరుకొందని గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రుతికి తోడు ఈ బ్రేకప్‌కి రాజకీయకారణాలూ ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గౌతమి త్వరలోనే ఓ రాజకీయ పార్టీ తీర్థం పుచ్చుకోబోతోందని, ఈ విషయంలో కమల్ హాసన్ విబేధించాడని, అంతగా రాజకీయాలే ముఖ్యం అనుకోంటే.. బ్రేకప్ చెప్పి వెళ్లిపోమని హెచ్చరించాడని, దానికి గౌతమి సరే అందని తెలుస్తోంది. గౌతమి – కమల్ల బ్రేకప్ ఎపిసోడ్ విషయంలో కమల్ ఇంత వరకూ స్పందించలేదు. తాను పెదవి విప్పితే.. సిసలైన కారణం బయటకు వస్తుంది.