కేవలం 50 రోజుల్లో పూర్తయ్యింది గురు సినిమా. ఆ స్పీడు.. జోరు చూసి వారెవా అనుకొన్నారు. జనవరి 26న ఈ సినిమాని విడుదల చేద్దామని ప్లాన్ వేశారు. ఓ దశలో సంక్రాంతి బరిలోనూ నిలిచింది గురు చిత్రం. ఆ తరవాత కాస్త వెనక్కి తగ్గింది. ఇప్పుడు రిపబ్లిక్ డేకి రావడం లేదు. సరికదా.. ఏకంగా రెండు నెలలు ఈ సినిమాని వాయిదా వేసేశారు. దానికి కారణం.. ఈసినిమాలోని కొన్ని సీన్లు సరిగా రాలేదని, వాటిని రీ షూట్ చేయాలని చిత్రబృందం భావించిందని వార్తలొచ్చాయి. అయితే అవేం కాదని, ఈ సినిమా వాయిదా పడడానికి కారణం అమీర్‌ఖాన్ నటించిన దంగల్ అని తెలుస్తోంది.
బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకొన్న సాలాఖదూస్కి గురు రీమేక్. సాలా ఖదూస్ పతాక సన్నివేశాల్ని కాస్త మార్చుకొని గురుగా తీశారు వెంకటేష్ అండ్ టీమ్. అయితే సరిగ్గా అవే సన్నివేశాలు దంగల్ క్లైమాక్స్‌లోనూ కనిపించాయట. దంగల్ సినిమా మహా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు గురు వస్తే.. దంగల్‌కి కాపీ అనుకొంటారు తప్ప, ఆల్రెడీ ఆయా సన్నివేశాలన్నీ సాలాఖదూస్లో ఉన్నాయన్న పాయింట్ ఎవ్వరూ గుర్తించరు. అందుకే కాపీ ముద్ర మనకెందుకులే… అని గురు టీమ్ తన సినిమా విడుదలని పోస్ట్ పోన్ చేసింది. రెండు నెలలు ఆలస్యంగా వస్తే.. ఈలోగా దంగల్ ఎఫెక్ట్ తగ్గిపోతోందన్నది గురు టీమ్ ఆలోచన. అందుకే… గురు వాయిదా పడింది.