ఆంధ్రప్రదేశ్లో జనవరిలో ముందస్తు ఎన్నికలొస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మరో వైపు బీజేపీ నేతలు చంద్రబాబుకు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా అని సవాళ్లు చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీకి దగ్గరగా ఉండే మీడియా చంద్రబాబు … తెలంగాణతో పాటు.. ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారని ప్రచారం ప్రారంభించేసింది. ఇవన్నీ ఒకదానికొకటి సంబందం లేనట్లుగా ఉన్నా.. తెలుగుదేశం పార్టీ నేతలు… మాత్రం తెర వెనుక రాజకీయం ఉందని నమ్ముతున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రశ్నే లేదని.. టీడీపీ నేతలందరూ పదే పదే చెబుతున్నారు. మంత్రి లోకేష్ కూడా ఇదే విషయాన్ని … విజయవాడలో జరిగిన హెచ్సీఎల్ స్టేట్ స్ట్రీట్ ప్రారంభోత్సవంలోనూ స్పష్టం చేశారు. మరి వైసీపీ అధినేత ఎందుకు అంత విస్తృతంగా జనవరిలో ఎన్నికలని ప్రచారం చేస్తున్నారు..?
దీని వెనుక ఉన్న అసలు కారణం… జగన్ పాదయాత్రనేంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. జగన్మోహన్ రెడ్డి మూడు వేల కిలోమీటర్లూ పూర్తవగానే పాదయాత్ర విరమించాలనే ఆలోచన చేస్తున్నారంటున్నారు. ఇంకా నలభై కిలోమీటర్లు నడక పూర్తి చేస్తే.. 3వేల కి.మీ పాదయాత్ర పూర్తయిపోతుంది. ఇడుపుల పాయ నుంచి పాదయాత్ర ప్రారంభించినప్పుడు… ఇచ్చాపురం వరకూ.. ఆరు నెలలు, మూడు వేల కిలోమీటర్లు నడుస్తానని ప్రకటించారు. ఇచ్చాపురం వరకూ వెళ్లాలంటే మరో రెండు నెలల వరకూ పట్టే అవకాశం ఉంది. కానీ జగన్ 3వేల కి.మీతో పాదయాత్ర ముగించాలనుకుంటున్నారు. దానికి కారణంగా ఆయన ముందస్తు ఎన్నికలనే చూపించాలని అనుకుంటున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జనవరిలో ఎన్నికలొస్తాయని ప్రచారం చేస్తే… ఎన్నికలకు సన్నద్ధం అయ్యేందుకు .. పాదయాత్రను విశాఖలోే నిలిపివేసినట్లు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎలాగూ… పాదయాత్రలో కవర్ చేయని నియోజకవర్గాలను… బస్సుయాత్ర ద్వారా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇచ్చాపురం నుంచే ఆ బస్సుయాత్ర ప్రారంభిస్తే.. పాదయాత్ర చేయాలేదనే భావన రాకుండా ఉంటుందనే ఆలోచన వైసీపీ పెద్దలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మొత్తానికి జగన్ ముందస్తునఎన్నికల ప్రచారం.. పాదయాత్ర ఆపేయడానికి ఓ కారణం వెదుక్కోవడానికేనన్న ప్రచారం కాస్త గట్టిగానే సాగుతోంది. దీనికి కారణం… ముందస్తుకు వెళ్లే విషయంలో ఏపీ ప్రభుత్వం కానీ.. టీడీపీ కానీ ఎలాంటి సన్నాహాలు చేస్తున్న సూచనలు కనబడకపోవడమే..!