రజనీకాంత్ సినిమా కబాలి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈనెల 1న విడుదల కావాల్సిన ఈ చిత్రం.. జులై 15 కి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా పర్వం కొనసాగించింది. 15న కబాలి రావడం లేదు. ఎప్పుడొస్తుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. షూటింగ్ పూర్తయిపోయినా… ఈసినిమా బయటకు రాకపోవడానికి కారణం.. రజనీకాంత్ మాత్రమే. రజనీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఆయన విశ్రాంతి తీసుకొంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి రజనీకాంత్ ఇప్పటి వరకూ డబ్బింగ్ మొదలెట్టలేదని టాక్. దాంతో పాటు రజనీపై కొంత ప్యాచ్ వర్క్ చేయాల్సివుందట. అది తప్ప.. మిగిలిన సినిమా అంతా పూర్తయ్యింది. తెలుగులో రజనీకాంత్ సినిమాలకు మనో డబ్బింగ్ చెబుతాడు. అయితే తమిళంలో మాత్రం సొంత గొంతే వినిపిస్తుంది. రజనీకాంత్ ఇంకా డబ్బింగ్ మొదలెట్టకపోవడం వల్లే.. కబాలి ట్రైలర్‌ని కూడా ఇప్పటి వరకూ విడుదల చేయలేదని తెలుస్తోంది. రజనీ ఎప్పుడొస్తాడో, ప్యాచ్ వర్క్ ఎప్పుడు పూర్తవుతుందో అని కబాలి టీమ్ ఎదురుచూస్తోంది. రజనీ ఇండియాలో అడుగుపెడితే గానీ… ఈ వాయిదాల పర్వానికి అడ్డుకట్ట పడదు.