భాజపా నేత కన్నా లక్ష్మీ నారాయణ పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని వీడేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఇదే అంశమై తన సన్నిహితులు, అనుచరులతో తన నివాసంలో ఇప్పటికే చర్చించారనీ, ఈ మేరకు ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చారనే తెలుస్తోంది. ఆయన పార్టీ మార్పు నిర్ణయానికి కారణం… భాజపా రాష్ట్ర అధ్యక్షుడి నియాకమే అని ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ అధ్యక్షుడిని ఎంపిక చేశారని సమాచారం.
నిజానికి, ఏపీ భాజపా అధ్యక్షుడి పదవి రేసులో మొదట్నుంచీ కన్నా లక్ష్మీ నారాయణ పేరు కూడా వినిపిస్తోంది. అయితే, భాజపా అధినాయకత్వం ఆయన్ని మూడో ఆప్షన్ గానే చూస్తూ వచ్చిందన్నది వాస్తవం. సోము వీర్రాజు, మాజీ మంత్రి మాణిక్యాల రావు… ఈ ఇద్దరిలోనే ఒకరికి పదవి గ్యారంటీ అనే చర్చే ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన కన్నా, పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. పార్టీలో మొదట్నుంచీ తనకు పెద్దగా గుర్తింపు ఇవ్వలేదనీ, తన సీనియారిటీకి తగిన ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తి కొన్నాళ్లుగా కన్నాలో ఉందనీ, అధ్యక్ష నియామక ప్రక్రియ సందర్భంగా ఇప్పుడది బయటపడిందని చెప్పుకోవచ్చు.
ఆయన భాజపాను వీడితే, ఏ పార్టీలో చేరతారనే అంశంపై కూడా కొంత స్పష్టత ఉందనే చెప్పుకోవాలి. ప్రతిపక్ష పార్టీ వైకాపాకి చెందిన కొంతమంది నేతలు ఈ మధ్య కన్నాతో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. దీంతో ఆయన భాజపాకి గుడ్ బై చెప్పేసి… వైకాపా గూటికి చేరతానే ప్రచారం జోరుగా జరుగుతోంది. అయితే, కన్నా పార్టీ మార్పు ఆలోచనను వేరే కోణంలో విశ్లేషించే అవకాశం ఉంది. పార్టీ అధ్యక్ష పదవి దక్కనంత మాత్రాన భాజపా నుంచి వెళ్లాల్సిన పనిలేదు. వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. ఈలోగా పార్టీలో ఆయనకి ప్రాధన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఏపీలో భాజపాపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. దీంతో రేప్పొద్దున భాజపా తరఫున ఏ స్థాయిలో పోటీకి దిగినా… ఆ వ్యతిరేకతను ఎదుర్కొని పోరాడాల్సి ఉంటుంది. కన్నాను ఈ అంశం కూడా ప్రభావితం చేసి ఉంటుందనేది కొంతమంది అభిప్రాయం.