ఇటీవల శాసనమండలి ఎన్నికల సందర్భంగా తెలుగుదేశంలో చాలా మంది ఆశావహులు నిరుత్సాహానికి గురైనారు. ఇకముందు ఆశలు పెట్టుకోవడానికి కూడా పెద్దగా అవకాశం లేదు. ఎందుకంటే గవర్నర్ కోటాలో అగ్రతరగతులకు ఇచ్చే ప్రసక్తిలేదని అద్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ ముందే స్పష్టం చేశారట. అయితే తమాషా ఏమంటే ఎంఎల్సి టికెట్ మీకు ఇవ్వలేకపోవడానికి కరణం బలరాం కారణమని ఇద్దరు ముగ్గురు ఆశావహులకు చెప్పడం. అలాఅని వారు మీడియా వర్గాల దగ్గర వాపోయారు. తీరా చూస్తే ఈ పేరే ముగ్గురికి అడ్డంకిగా చూపినట్టు కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా నుంచి తీవ్రమైన వత్తిడి వచ్చినందువల్లనే ఆయనకు చోటు కల్పించాల్సి వచ్చిందని వీరికి చెప్పారు. ఈ మాట నిజమైతే బలరాం మాత్రం వూరుకుంటాడా? నన్నెందుకు అంత బలవంతంగా ఎంపిక చేశారని అడగరూ? కాబట్టి అక్కడ మరో విధమైన ఓదార్పు. పార్టీలలో అవకాశాలు తక్కువగా వుండటం అందరికీ చోటు కల్పించలేకపోవడం సహజమే. అయితే ఆ క్రమంలో అందరికీ ఒకే సాకు చెబితే అతకదని టిడిపి అగ్రనేతలకు అర్థం కాలేదా?