కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ ను ఆయన భార్యే హత్య చేశారు. అది మామూలు హత్య అయితే క్షణికావేశంలో జరిగిందేమో అని అనుకుంటారు. కానీ ఆయనను ప్లాన్డ్ గా కరుడు గట్టిన నేరస్తులు మాదిరి ప్రాణం పోయే వరకూ చంపుతూ ఉండటం అంటే ఊహించలేనంత కూరత్వం చూపడమే. పోలీస్ సర్వీస్ లో ఆయన ఎన్నో చూసి ఉండవచ్చు కానీ తాను అలాంటి చావుకు గురవుతానని ఆయన ఊహించి ఉండరు.
కళ్లల్లో కారం కొట్టి – 20 నిమిషాల సేపు హింస
ఓం ప్రకాష్ ను మర్డర్ చేసిన విధానం చూసి పోలీసులు కూడా భయపడిపోయారు. ఆయన భార్య ఇంత క్రూరంగా హత్య చేశారా అని ఆమె వైపు భయంగా చూడాల్సి వచ్చింది. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మొదట కంట్లో కారం కొట్టారు. తర్వాత చేతులు కట్టేశారు. బీర్ బాటిల్ తో తల పగులగొట్టారు. అయినా చనిపోలేదని చాకుతో పొడిచారు. ఆయన ఇరవై నిమిషాల సేపు నరకయాతన అనుభవించి ప్రాణాలు కోల్పోయారు. అంత సేపు హంతకురాలు .. అయ్యో పాపం అనుకోలేదు. తన జీవిత భాగస్వామి అని అనుకోలేదు. ఇదే మానసిక నిపుణుల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కుటుంబ పెద్దపై ఇంత ద్వేషమా ?
ఆయన ఎలాంటి వాడు అయినా కావొచ్చు కానీ కుటుంబ పెద్ద. కుటుంబం కోసమే ఆయన సంపాదించి ఉంటాడు. పని చేసి ఉంటాడు. అంత చేసినందుకు ఆయనకు క్రూరమైన హత్య బహుమతిగా ఇచ్చారా ?. ఆస్తి వివాదాలతో ఆయన ఇంట్లో ఉండటం లేదని అప్పుడప్పుడు వస్తున్నారని చెబుతున్నారు. హత్య చేయడానికి ప్రణాళిక ప్రకారం పిలిచి చంపేశారని పోలీసులు గుర్తించారు.
మనుషుల్లో ఇంత విపరీతం ఎలా ?
కరుడుగట్టిన నేరస్తులు కొంత మంది ఉంటారు. వారికి మనుషుల పీకలు కోయడం పెద్ద విషయం కాదు. కానీ సామాన్యులకు మాత్రం వేరే వాళ్లకు దెబ్బతగిలినా తట్టుకోలేరు. కుటుంబసభ్యులను ఎంత వ్యతిరేకించినా వారికి హాని చేయాలని అనుకోరు. కానీ ఇక్కడ జరిగింది వేరు. అత్యంత పాశవికంగా హత్య చేశారు. ఆస్తి కోసమే ఈ హత్య జరిగితే.. మానవసమాజంలో .. మనుషుల్లో సున్నితత్వం పూర్తిగా కనుమరుగు అయిపోతుందని అనుకోవచ్చు.