తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తుల్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదని కొంతమంది అంటుంటారు! ఆయన ఎక్కడ నుంచి ఎక్కడికైనా టర్న్ తీసుకోగలరు..! ఎట్నుంచి ఏది చేసైనా సరే, ప్రతికూల పరిస్థితులను కూడా ఇట్టే తనకు అనుకూలంగా మార్చేసుకుంటారనడంలో సందేహం లేదు. ఈ మధ్య, కాంగ్రెస్ పార్టీ దూకుడుకి బడ్జెట్‌తో చెక్ పెట్టేశారు! ప్రజావ్యతిరేకత ఎక్కడో మొదలైందన్న సూచనలు తెలియగానే… కులాల వారీగా ప్రజలను ఆకర్షించేందుకు బడ్జెట్ కేటాయింపులు ప్రకటించారు. దీంతో అన్ని నోళ్లూ మూతబడ్డాయి..! తాజాగా పరిపూర్ణానంద స్వామితో కేసీఆర్ భేటీ కావడం.. సీఎం స్వయంగా వెళ్లి మరీ కలవడం వెనక కారణాలు ఏమై ఉంటాయబ్బా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఏ ప్రయోజనం ఆశించకుండా కేసీఆర్ ఇలాంటి ట్విస్టులు ఇవ్వరు కదా..! ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది కదా..! ఇలా ఆలోచించేవారు ఓ కొత్త అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నారు. తెలంగాణలో భాజపా నాయకులు నోటికి తాళం వేయించడమే… పరిపూర్ణానందతో కలయిక వెనక మర్మం అనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎందుకంటే, రాష్ట్రంలో మత ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పించేందుకు కేసీఆర్ సర్కారు సంసిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తెరాస ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భాజపా నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మత ప్రాతిపదిక రిజర్వేషన్లు ఏంటంటూ హిందూ సంఘాలు కొన్ని కాస్త హడావుడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి నోళ్లు మూయించాలంటే… ఏదో ఒక చెక్ పాయింట్ అవసరం కదా!
ఒక టీవీ ఛానెల్‌కు వచ్చిన పరిపూర్ణానంద స్వామిని కలిసేందుకు ముఖ్యమంత్రే స్వయంగా వెళ్లడం విశేషం..! అంతేకాదు, ఆయన చెప్పిన ఆర్థిక కష్టాలు కొన్ని విని… తోచిన సాయం ప్రకటించడం కూడా ఇక్కడ గమనార్హం. ఇంతకీ ఈ స్వామీజీ అంటే కేసీఆర్ సాబ్ కి ఇంత ప్రేమ ఎందుకంటే.. మరో కోణం కూడా ఉంది. ఆ మధ్య దేవాలయాలకు మొక్కులు చెల్లింపు పేరుతో భారీ ఎత్తున కానుకలిచ్చారు కేసీఆర్. వ్యక్తిగత మొక్కుల చెల్లింపులకు ప్రజాధానం దుర్వినియోగం చేయడం ఎంతవరకూ సబబు అంటూ కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ తరుణంలో కేసీఆర్‌కు మద్దతుగా మాట్లాడారు పరిపూర్ణానంద.
సో.. ఆయన్ని కలవడం వెనక స్వకార్యంతోపాటు, స్వామి కార్యం కూడా అవుతుందని కేసీఆర్ భావించినట్టు, అంది వచ్చిన అవకాశాన్ని ఇలా వాడుకుని.. కృతజ్ఞతను ప్రదర్శిస్తూనే, చేయాల్సిన రాజకీయానికి అనుగుణంగా పరిస్థితిని మలుచుకున్నారని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒక ప్రయోజనం లేకుంటే.. కేసీఆర్ ఈస్థాయిలో స్పందించరు కదా! ఎందుకంటే, కేసీఆర్ ఇక్కడ..!