తెలంగాణ అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారు..?. ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. దీనికి సమాధానం ఒక్క కేసీఆర్ దగ్గరే ఉంది. కానీ ఆయన రకరకాల కారణాలు చెబుతున్నారు. బహిరంగసభల్లో కాంగ్రెస్సే కారణమంటున్నారు. కాంగ్రెస్ ఎలా కారణం అంటే… వాళ్లు విమర్శలు చేస్తున్నారని.. అందుకే రద్దు చేశానంటారు. మరోసారి అభివృద్ధి పథకాలు ఆగకూడదని రద్దు చేశానంటున్నారు. మరో తొమ్మిది నెలలు ప్రభుత్వం కొనసాగితే.. అభివృద్ధి పథకాలు ఎందుకు ఆగిపోతాయో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు. ఇలా ఉండగా.. అసలు ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందంటూ.. హైకోర్టులో పిటిన్లు దాఖలయ్యాయి. గతంలో ఈ పిటిషన్లను కొట్టి వేసినా… కాంగ్రెస్ ముఖ్యనేత డీకే అరుణ కొత్త కోణంలో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభను సమావేశపర్చకుండా ప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వాన్ని రద్దు చేశారని.. ప్రభుత్వం రద్దు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ వాదించారు. వ్యూహాత్మకంగా ప్రభుత్వం రద్దు చేయాడాన్ని డీకే అరుణ తప్పు పట్టలేదు కానీ.. రద్దు చేసిన విధానం మాత్రం రాజ్యాంగ విరుద్ధమంటున్నారు. దీనిపై… ప్రభుత్వం తరపున న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. నాలుగేళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు 200 పిటిషన్లు కోర్టుల్లో వేశారట. దీనిపై ప్రజల్లోకి వెళ్లేందుకు మేము ప్రభుత్వాన్ని రద్దుచేశామని వాదన వినిపించారు. ప్రభుత్వం తరపున న్యాయవాది వాదన విని… న్యాయవర్గాల్లోనే … సౌండ్ లేకుండా పోయింది. 200 పిటిషన్లు వేస్తే.. ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా..? రేపు.. ఒక వేళ మళ్లీ గెలిస్తే… 2001 పిటిషన్లు వేస్తే మళ్లీ రద్దు చేస్తారా..? అన్న కామెంట్లు హైకోర్టు పరిసరాల్లోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. ప్రభుత్వ రద్దు నిర్ణయాన్ని తప్పు పట్టే అధికారం కోర్టుకు లేకపోవచ్చు కానీ.. అందులో ఉన్న రాజ్యాంగ అంశాలపై మాత్రం.. కోర్టు స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ అంశంపై మిగిలిన పిటిషన్లతో పాటు డీకే అరుణ పిటిషన్ను కోర్టు ఇంప్లీడ్ చేసింది. కేసు ఎమైనా తేలనీ కానీ.. ప్రభుత్వం చెప్పిన కారణం మాత్రం… హాస్యాస్పదంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.