మూడు రోజులకో సారి.. పార్టీ అభ్యర్థులకు ఓ సారి ఫోన్ చేసి.. ప్రచార సామాగ్రి వచ్చిందా.. అని వాకబు చేస్తున్న కేసీఆర్… ఈ సారి అందర్నీ పిలిచి మాట్లాడాలని నిర్ణయించారు. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత చేయించిన సర్వేలను ముందు పెట్టుకుని.. ప్రచారంలో అభ్యర్థులు అుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశం జరుగుతుంది. ప్రతి అభ్యర్థితోనూ కేసీఆర్.. మాట్లాడనున్నారు. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా వ్యవహరించాల్సిన పద్ధతులపై సీఎం కేసీఆర్ కొన్ని కిటుకులు చెబుతారట.
అభ్యర్థిగా ప్రకటించి నెలన్నర దాటి పోవడంతో… చాలా మంది ఒక విడత ప్రచారాన్ని పూర్తిచేసుకున్నారు. ప్రజల్లోకి వెళ్తూ.. ఏం చెప్పుకోవాలో తెలియడం లేదని.. అభ్యర్థులు గొణుక్కోవడంతో.. మ్యానిఫెస్టోలో ఓ భాగాన్ని ప్రకటించారు కేసీఆర్. వచ్చేవారం నుంచి కేసీఆర్ వంద సభల నిర్వహణ ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌పై కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. పార్టీ అభ్యర్థులను ప్రచారానికి సన్నద్ధం చేయడం, ఓటర్లకు ప్రభుత్వం ఇప్పటివరకు అమలుచేసిన పథకాలు, పార్టీ అధికారంలోకి రాగానే అమలుచేసే పథకాలు, ఓటర్లను ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చేయడం, ఓట్లు టీఆర్ఎస్కు వేసే విధంగా చూడటం ఇలా పోల్ మేనేజ్మెంట్పై అవగాహన కల్పించడంపై సీఎం కేసీఆర్ దృష్టి నిలిపారు.
కేసీఆర్ ప్రజాకర్షక హామీలు ప్రకటించారన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది. అవి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న హామీల్లానే ఉన్నాయి. అవి.. కాంగ్రెస్ కాదు.. టీఆర్ఎస్ చేస్తానంటోందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. కేసీఆర్… అందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గాల్లో అభ్యర్థుల పరిస్థితి… ఎక్కడెక్కడ మెరుగుపడాలో నివేదికలు కూడా.. కేసీఆర్ ఇవ్వనున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.